హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు ఇక ఆ చివరి రెండు రోజుల పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. ఎన్నికల ప్రచార పర్వంలో అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సాధారణంగా చివరి రెండు రోజుల్లో నేరుగా ఓటర్లను కలిసే ప్రక్రియను కొనసాగిస్తుంటాయి ఆయా పార్టీలు. ఈ క్రమంలో పోలింగ్‌కు ముందు రెండు రోజులు అన్ని పార్టీలు సమీకరణాలు మార్చేందుకు ప్రత్యేక దృష్టి పెడతాయి. ప్రచార హోరులో ఓటర్లు నేరుగా పట్టించుకోని పార్టీలు చివరి రోజుల్లో మాత్రం ఎక్కడెక్కడి ఓటర్లలో తమకు వ్యతిరేకత ఉందో గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకొనే యత్నం చేస్తాయి.
పోల్ మేనేజ్‌మెంట్ పనిలో..
ఈసారి హుజూరాబాద్ ఎన్నికలు అతి ఖరీదైనవిగా పేరు రావడంతో అదే తరహాలో తాయిలాలకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఎన్నికల కమిషన్ ఈసారి మాత్రం నాన్ లోకల్ ఓటర్లు 72గంటలు ముందే హుజూరాబాద్ వదిలి వెళ్లాలని సూచించింది. దీంతో ఈ నెల 27 తర్వాత స్థానికేతర నాయకులు, పార్టీ శ్రేణులు ఎవరూ కూడా హుజూరాబాద్ నియోజవకర్గంలో ఉండకూడదు. అయితే ఎన్నికల అధికారుల కళ్లుగప్పి పోల్ మేనేజ్‌మెంట్ చేసుకునే పనిలో వివిధ పార్టీలు నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. అధికారులకు తెలియకుండా నియోజకవర్గంలో తమ పార్టీ సానుభూతి పరులను కలుసుకొనేందుకు షెల్టర్లను గుర్తించే పనిలో పడ్డట్టు సమాచారం.
పట్టణాల నుంచి పల్లెల వైపు దృష్టి
ఎన్నికల ప్రచారం కోసం హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ పట్టణాలతో పాటు ప్రధాన సెంటర్లలో షెల్టర్ తీసుకున్న నాయకుల్లో కొంతమంది పల్లెబాట పట్టే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తమ పార్టీ సానుభూతి పరుల ఇళ్ల వివరాలను సేకరించి ఎక్కడెక్కడ మకాం వేయాలో నిర్ణయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆయా పార్టీల నాయకుల గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఇండ్లు, పెద్ద భవంతులు అనుకూలమైన ప్రాంతాల వివరాలను సేకరిస్తున్నారు. 27వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూనే తిరిగి ఇదే నియోజకవర్గంలో తలదాచుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.