తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న 'ఉల్లి' ధరలు

కరోనా వల్ల ఉపాధి లేక.. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల్లో ప్రతిరోజూ అవసరమయ్యేది.. ఉల్లి. కూరకు రుచి రావాలన్నా.. అసలు వంట మొదలు పెట్టాలన్నా ఉల్లి ఉండాల్సిందే. కాబట్టి ఎంత ధర పెరిగినా.. ఉల్లి ప్రతిరోజూ కొనాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర, ఇతర కూరగాయల ధరలు పెరగడం వల్ల సామాన్యులు మార్కెట్​కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు వంద రూపాయలకు మూడు కిలోలు దొరికిన ఉల్లి.. ఇప్పుడు కిలోకు వంద రూపాయలు ధర పెరిగి.. ఉల్లి కోసే కంటే ముందే.. కొంటుంటే కన్నీరు తెప్పిస్తోంది.

Onion Price Increases In Markets
సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న 'ఉల్లి' ధరలు

By

Published : Sep 27, 2020, 11:44 PM IST

నిన్నటి వరకు రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.25 నుంచి రూ. 30 పలికిన ఉల్లి ధర అమాంతం 70నుంచి 80రూపాయలకు ఎగబాకింది. ప్రతిరోజూ.. ఎంతో అవసరమయ్యే.. ఉల్లి కోయడానికి ముందే.. కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తే దాని ధర కూడా కొండెక్కింది. అటు కూరగాయల ధరలు.. ఇటు కోడిగుడ్ల ధరలు కొండెక్కగా తాజాగా ఉల్లిధర కూడా పెరిగి సామాన్యుని కంట కన్నీరు తెప్పిస్తోంది. ధర పెరిగినప్పటికీ.. తినక తప్పదు కాబట్టి.. మార్కెట్​కు వెళ్తున్న కొనుగోలుదారులకు.. నాణ్యత లేని ఉల్లి అసంతృప్తికి గురి చేస్తోంది.

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న 'ఉల్లి' ధరలు

ధర పెరిగినా.. నాణ్యత లేదు..

మహారాష్ట్ర నుంచి తెల్ల ఉల్లి, కర్నూలు నుంచి.. ఎర్రఉల్లి కరీంనగర్ మార్కెట్‌కు వస్తోంది. గతంలో ఎక్కడ చూసినా ఉల్లి విరివిగా కనిపించేది. కానీ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉల్లిలో నాణ్యత లేదని.. అంత ధర పెట్టి కొనాలంటే మనసొప్పడం లేదని మహిళలు వాపోతున్నారు. వేసవిలో పంట చేతికి వచ్చే సమయంలో కిలో ఉల్లిగడ్డ ధర 5రూపాయలు పలుకగా.. ఆ తర్వాత పది రూపాయలకు చేరింది. జులై, ఆగస్టు మాసాల్లో కిలో ఉల్లి రూ.20 పలికింది. సెప్టెంబర్‌ మొదటి వారంలో 30 రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు అమాంతం 70నుంచి 80రూపాయలకు పెరిగింది.

వర్షాలే కారణమంటున్న వ్యాపారులు..

వ్యాపారులు మాత్రం ఉల్లి ధర పెరగడానికి ప్రధాన కారణం వర్షాలే అంటున్నారు. కరీంనగర్‌కు మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుబడి అవుతుంది. అయితే గత నెలరోజులుగా అక్కడ కూడా వర్షాలు కురుస్తుండటం వల్ల పంటమొత్తం వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉండిపోయిందని వ్యాపారులు అంటున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ఆ పంట వస్తే తప్ప.. ఉల్లిధర తగ్గే సూచనలు లేవంటున్నారు మార్కెట్​ నిపుణులు. ప్రస్తుతం వస్తున్న ఉల్లిలోనూ నాణ్యత లేదని ఆందోళన వ్యాపారులు, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలావరకు మురిగిపోయి ఉండటం వల్ల ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ధరలు పెంచామని చెప్తున్నారు. ఉత్తర తెలంగాణకు ప్రతిరోజు దాదాపు 500కు పైగా ఉల్లి లారీలు రావాల్సి ఉండగా 100కూడా రావడం లేదు. అందుకే.. కొరత పెరిగి ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. వర్షాలు ఇంకా కురుస్తున్న దృష్ట్యా ఇప్పుడప్పుడే ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని.. ప్రభుత్వం ఉల్లి ధరపై దృష్టి సారించాలని సామాన్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:డ్రగ్స్ కేసు: రకుల్ విచారణలో మరో నాలుగు పేర్లు!

ABOUT THE AUTHOR

...view details