కరీంనగర్ జిల్లా మూలసాల గ్రామానికి చెందిన బంక మల్లేశంకు చిన్నప్పటి నుంచి వైద్య వృత్తి అంటే ఎనలేని ప్రేమ. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతనికి ఆర్థిక స్థోమత లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. మల్లేశానికి వైద్యవిద్య మీద ఉన్న ఆసక్తి గమనించిన స్థానిక ప్రజలు అతని చదువకయ్యే ఖర్చుని భరించారు. ప్రజల సొమ్ముతో వైద్య వృత్తి చేపట్టి... ప్రభుత్వ వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఉద్యోగ విరమణ అనంతరం ఎమ్మెస్ పూర్తి చేశాడు. సర్కారు డాక్టరుగా ఎనలేని సేవలందించిన మల్లేశం... జీవితాన్నిచ్చిన వారి కోసం జీవితాంతం సేవలందించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంటి దగ్గరే ప్రైవేటు క్లినిక్ ప్రారంభించాడు. వారంలో మూడు రోజుల ఉచిత చికిత్సలు చేస్తూ... మదర్ థెరిస్సా బాటలో నడుస్తున్నాడు.
ప్రతిరోజు ఉదయాన్నే ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానానికి చేరుకొని కసరత్తులు చేస్తాడు. అనంతరం వాకర్స్కి వ్యాయామ తరగతులు చెప్తాడు. మొదట్లో నడకదారులు బంక మల్లేశంను హేళన చేశారు. పొంతన లేని వ్యాయామం చేస్తుంటారని చులకనగా చూశారు. అవేమీ పట్టించుకోకుండా డాక్టర్ మల్లేశం ప్రతి ఒక్కరిని వ్యాయామం చేయాలని సూచించారు. ఐదుగురితో ప్రారంభమైన వ్యాయామం ప్రస్తుతం వంద మందికి చేరింది.