Opened Yellampally Project Pipeline at Gangadhara : గత కొన్ని రోజులుగా వర్షాకాలంలో చెరువులకు గండ్లు పడి ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్లతో నీటి విడుదల ఆగిపోవడంతో రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల ఆందోళనతో ఎట్టకేలకు మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్ ఓపెన్ చేసి నారాయణపూర్ జలాశయంలోకి నీటిని విడుదల చేశారు. యాసంగి పంటలకు అయినా సాగునీరు అందుతుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోకుండా రైతులకు లబ్ధి చేకూరనుంది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్, ఎల్లమ్మ, మంగపేట చెరువులకు వర్షాకాలంలో గండ్లు పడ్డాయి. దాంతో ప్రతీ ఏటా ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్‌తో నీటిని విడుదల చేసే ప్రక్రియ నిలిచి పొయింది. ఇటీవల అధికారులు మరమ్మతు చేపట్టినా నంది మేడారం పంప్‌హౌస్ వద్ద లీకేజి ఏర్పడింది. దానివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరమ్మతులు చేసినా నీటి పారుదల శాఖ అధికారులు ప్రస్తుతానికి ఒక పంపును సిద్దం చేసి నారాయణపూర్ జలాశయంలోకి నీటిని నింపుతున్నారు. దీనితో రైతులకు కొంత ఊరట లభించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా గంగాధర, నారాణయణపూర్ జలాశయాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులకు పైపులైన్ల మూసివేతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా బీడుగా వదిలేసిన వారు.. మిగిలిన కొద్ది పంటను కాపాడుకోవాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అరకొర సాగునీటితో వేసిన వరిపంటకు మొగిపురుగు, ఇతర తెగుళ్లతో పెట్టుబడులు గుదిబండగా మారాయని, పంట చేతికి రావాలంటే ఇంకెన్ని పాట్లు పడాలోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వర్షాకాలంలో వచ్చిన భారీ వరదలకు కరీంనగర్ జిల్లాలో గంగాధర, నారాయణపూర్ చెరువుల కట్టలు తెగిపోగా నీరు లేక పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. రైతుల ఆందోళనతో ఇటీవల నారాయణపూర్ చెరువు కట్ట మరమ్మతులు పూర్తి చేశారు. అయితే తమకు రావాల్సిన పరిహారం వచ్చాకే గంగాధర ఎల్లమ్మ చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని మంగపేట గ్రామస్థులు పలుమార్లు అధికారులను అడ్డుకున్నారు. బోయినపల్లి, వేములవాడ వైపు కుడికాలువ పూర్తి కాకపోగా ఎగువ గ్రామాల్లో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేస్తుండగా చెరువులకు గండ్లు పడడంతో ఎడమ కాలువకు కూడా నీరు అందించలేని దుస్థితి నెలకొంది. గంగాధర, కొడిమ్యాల, మల్యాల, రామడుగు, చొప్పదండి మండలాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా దాదాపు 20 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. నారాయణపూర్ చెరువును త్వరగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా నింపి వేసిన పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: