తెలంగాణ

telangana

ETV Bharat / state

Rameshanna kanuka : ఆ ఊరిలో పుట్టే ప్రతి అమ్మాయి.. బంగారు తల్లే..! - ఆడపిల్ల పుడితే 5వేలు

Rameshanna kanuka : ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే వరం...! పల్లెలో పుట్టే ప్రతీ అమ్మాయి బంగారుతల్లే..! ఇందుకు కారణం ఆ గ్రామ సర్పంచి తీసుకున్న నిర్ణయం..! పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక భరోసా కల్పించేలా తనకు చేతనైనంత స్థాయిలో ఓ పథకాన్ని అమలుచేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్‌ పంచాయతీలో అమలవుతున్న ఈ పథకం ఇతర పల్లెలకూ స్ఫూర్తిగా నిలుస్తోంది..

Rameshanna kanuka
Rameshanna kanuka

By

Published : Jul 19, 2022, 1:30 PM IST

ఆ ఊరిలో పుట్టే ప్రతి అమ్మాయి.. బంగారు తల్లే

Rameshanna kanuka : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన నుస్తులాపూర్‌...! ఈ గ్రామ పంచాయతీ ఎన్నో అభివృద్ధి పనులతో ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీగా ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకుంది. ఇదే కోవలో సర్పంచ్‌ రావు రమేశ్‌ చొరవతో అమలవుతున్నమరో కార్యక్రమం... గ్రామాన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది.

Ramesh Anna kanuka in Nustulapur : అమ్మాయి పుడితే ఎవరూ భారం భావించకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు సర్పంచ్‌ రావు రమేశ్‌. ఇందులో మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టగానే రమేశన్న కానుక కింద 5వేల 116 లను వారికి అందిస్తున్నారు. గత ఏడాది దసరా రోజున ప్రారంభించిన దీని ద్వారా 5వేల 116లను బ్యాంక్, పోస్టాఫీసు ఖాతాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారు.

సర్పంచ్ అందిస్తున్న రమేశన్న కానుక పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని లబ్ధిపొందిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా సర్పంచ్‌ ఉచితంగా పేద గర్భిణులకు సీమంతాలు నిర్వహిస్తారని తెలిపారు. పుట్టింటి ప్రేమను కానుకగా ఇస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

"మా ఊళ్లో సర్పంచ్.. తన సొంత ఖర్చులతో ఆడపిల్లలకు కానుక ఇస్తున్నారు. ఆడపిల్ల పుట్టడమే భారంగా భావిస్తున్న నేటి తరంలో.. అమ్మాయి పుట్టడం మహాలక్ష్మి అడుగుపెట్టినట్టుగా భావించి చిన్నారుల పేరిట రమేశన్న కానుక అందించడం ఆనందంగా ఉంది. ఈ నగదును ఎఫ్డీ చేయడం వల్ల మా పిల్లల చదువు, పెళ్లిలకు ఉపయోగపడుతుంది. మహిళలకు పెద్దన్నగా.. సీమంతం కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా.. ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు." - మహిళలు, నుస్తులాపూర్‌

గ్రామంలో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నుస్లాపూర్‌ అనేక పురస్కారాలు అందుకుందని సర్పంచి తెలిపారు. పేదవారింట్లో ఆడపిల్ల పుడితే బాధపడకుండా, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో తొలిచూరు ఆడపిల్ల పుడితే కానుక ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలతో పాటు ఎన్నో సొంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా నిలుస్తోంది... నుస్తులాపూర్‌.

"ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు.. ఆడపిల్ల పుట్టడం భారంగా భావించడం చూశాం. ప్రతిరోజు ఎక్కడోచోట అప్పుడే పుట్టిన పసిపిల్లలను చెత్తకుప్పల్లో పడేయటం కూడా చూశాం. ఇవన్నీ చూసి చాలా బాధగా అనిపించింది. అందుకే ఆడపిల్లలను కన్నవాళ్లకు అండగా ఉండాలని నిశ్చయించుకున్నాను. నాకు చేతనైనంత సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగా చేపట్టిందే ఈ రమేశన్న కానుక కార్యక్రమం. దీనిద్వారా మా ఊళ్లో తొలికాన్పులో ఆడపిల్ల పుడితే ఆ పాప పేరిట రూ.5వేల 116ను బ్యాంక్, పోస్టాఫీసు ఖాతాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తున్నాం." - రావు రమేశ్, గ్రామ సర్పంచ్, నుస్తులాపూర్

ABOUT THE AUTHOR

...view details