తెలంగాణ

telangana

ETV Bharat / state

ACCIDENTS: ప్రమాదాల మార్గం.. అందుబాటులోని లేని అత్యవసర సేవలు - తెలంగాణ వార్తలు

పెరుగుతున్న వాహనాలతో జాతీయ, రాష్ట్రీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పాటే ప్రమాదాలూ పెరిగాయి. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందక చాలా మంది ఆసుపత్రులకు తీసుకెళ్తుండగానే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ట్రామా కేర్‌ కేంద్రాల ఆవశ్యకత ఎంతో ఉంది.

ACCIDENTS ON MAIN ROAD, emergency SERVICES NOT AVAILABLE
అందుబాటులోని లేని అత్యవసర సేవలు, ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు

By

Published : Jul 28, 2021, 9:58 AM IST

Updated : Jul 28, 2021, 11:49 AM IST

ఉత్తర తెలంగాణలో ప్రధాన మార్గమైన రాజీవ్‌ రహదారి సికింద్రాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు 240 కిలోమీటర్ల దూరం విస్తరించింది. ఈ మార్గంలో నిత్యం పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో గత మూడేళ్లలో 1,869 ప్రమాదాలు సంభవించగా 2,384 మంది గాయపడ్డారు. ఇందులో 686 మంది మృత్యువాత పడ్డారు. మంచిర్యాలలో లేక రామగుండంలో రోడ్డు ప్రమాదం జరిగినపుడు క్షతగాత్రులను టోల్‌ప్లాజా సిబ్బంది లేదా 108 సిబ్బంది సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్తున్నారు. అక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు లేక సిబ్బంది చేతులెత్తేస్తుండటంతో హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తోంది. దీంతో మార్గమధ్యంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ రహదారులపై ఇబ్బడిముబ్బడిగా ట్రామాకేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, రాష్ట్ర రహదారులపై వీటి అవసరాన్ని గుర్తించడం లేదు.

అంబులెన్సు, ప్రాథమిక చికిత్స మాత్రమే..

బీవోటీ(నిర్మించు-నిర్వహించు-బదలాయించు) పద్ధతిలో రాజీవ్‌ రహదారిని హెచ్‌కేఆర్‌ రోడ్‌వేస్‌ సంస్థ నాలుగు వరుసలుగా విస్తరించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో దుద్దెడ, రేణిగుంట, బసంత్‌నగర్‌ల వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు చోట్ల మాత్రమే అంబులెన్సులు, రూట్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదాలు జరిగినపుడు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించే వరకే గుత్తేదారు సంస్థ బాధ్యత. సహాయక చర్యలు, అంబులెన్సు సౌకర్యం, ప్రాథమిక చికిత్స మాత్రమే వీరు అందిస్తున్నారు.

అందని ద్రాక్షగానే సత్వర వైద్యం

  • రహదారి ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రులకు అందించే చికిత్సనే ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు. ఈలోగా సమీప ఆసుపత్రికి లేదా ట్రామాకేర్‌ కేంద్రానికి తీసుకెళ్తే ప్రాణాపాయం నుంచి తప్పించే అవకాశాలున్నాయి.
  • ట్రామాకేర్‌ అందుబాటులో ఉంటే సత్వర చికిత్స అందుతుంది. అవి లేకపోవడంతో సంఘటన స్థలం నుంచి రక్తమోడుతున్న క్షతగాత్రులను, కొన ఊపిరితో ఉన్నవారిని దూరంలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడుస్తున్నారు. రహదారులపైనే ట్రామా కేర్‌ కేంద్రాలుంటే ఎమర్జెన్సీ ఫిజీషియన్‌, టెక్నీషియన్లు, న్యూరో, ఆర్థోపెడిక్‌ సర్జన్లు అందుబాటులో ఉంటారు. ఎక్స్‌రే, ఆల్ట్రా, సీటీ స్కాన్‌లు, రక్తనిధి కేంద్రం, ఇతరత్రా అన్ని వైద్య సదుపాయాలుంటాయి.
  • ఇలాంటి అత్యవసర కేసుల విషయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల పరిధిలోని రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులే పెద్ద దిక్కుగా మారాయి. హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై క్షతగాత్రులకు సత్వర చికిత్సలు అందించేందుకు గతేడాది అక్టోబరులో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ట్రామా కేర్‌ సెంటర్‌, అంబులెన్సులు ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎన్‌హెచ్‌ఎం నిర్ణయం తీసుకోవాలి :

రాజీవ్‌ రహదారిపై ఇరుకుగా ఉండే గోదావరిఖని, పెద్దపల్లి ప్రాంతాల్లో ఏదో ఒక చోట ట్రామా కేర్‌ కేంద్రం ఏర్పాటు అత్యవసరం. రహదారి పక్కనే ఆసుపత్రి నిర్మాణంతో పాటు నరాలు, ఎముక, మత్తు వైద్య నిపుణులు, జనరల్‌ ఫిజీషియన్‌ క్రిటికల్‌ కేర్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. బ్లడ్‌బ్యాంక్‌, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. ఇది జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఉంటుంది. కొవిడ్‌కు ముందు పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటివరకు మార్గదర్శకాలు రాలేదు.

-వాసుదేవరెడ్డి, జిల్లాసుపత్రి పర్యవేక్షకులు

మార్గదర్శకాలు వేర్వేరుగా ఉంటాయి:

జాతీయ, రాష్ట్ర రహదారుల విషయంలో ట్రామాకేర్‌ కేంద్రాల ఏర్పాటుకు మార్గదర్శకాలు వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్ర రహదారులపై ఈ కేంద్రాలు లేవు. రాష్ట్రంలోనే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి(పీపీపీ)లో నిర్మించిన ఏకైక రహదారి ఇది. ట్రామా కేర్‌ కేంద్రం ఏర్పాటుపై ఎవరైనా వినతిపత్రం ఇస్తే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్యఆరోగ్య శాఖతో కలిసి ఏర్పాటు చేస్తాం. 25 సంవత్సరాల పాటు టోల్‌ వసూలు చేసేలా హెచ్‌కేఆర్‌ సంస్థతో ఒప్పందం ఉంది. జాతీయ రహదారిగా మార్చాలంటే ఈ సంస్థకు.. వారికి బాకీ ఉన్న నిధులు కేటాయిస్తేనే ఆ ప్రతిపాదన ముందుకెళ్తుంది.

-మధుసూదన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ సీఈ(పీపీపీ ప్రాజెక్టు), హైదరాబాద్‌

ఇదీ చదవండి:FIRE ACCIDENT: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

Last Updated : Jul 28, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details