కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల్లో (HUZURABAD BYPOL)పోటీపై తన అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం అడిగినట్లు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు (NSUI TELANGANA PRESIDENT)బలమూరి వెంకట్ తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పానన్న వెంకట్.. ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవాడినైనందున.. అభ్యర్థి ఎంపికలో తన అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం సేకరించినట్లు భావిస్తున్నానన్నారు. పార్టీ పోటీ చేయమంటే పోటీచేస్తానన్నారు.
హుజూరాబాద్‌లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని యోచిస్తున్న కాంగ్రెస్.. గత నెల రోజులుగా వేట కొనసాగిస్తున్నా.. ఎవరు పోటీలో ఉంటారనే దానిపై ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. విడతల వారీగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ.. స్థానిక నాయకత్వంతో పలుమార్లు చర్చించినా.. తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏఐసీసీకి పంపిన పేర్లపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
నేడైనా తేలేనా..
దీనిపై రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక నాయకులు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పరపు సంపత్, కిసాన్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్.. పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మాణిక్కం ఠాగూర్ కూడా హైదరాబాద్‌లోనే ఉండడంతో అభ్యర్థి ఎంపికపై.. స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.