తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad by election: ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల​ ఘట్టం.. ప్రచారాలపై ఈసీ ఆంక్షలు - telangana varthalu

huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు
huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

By

Published : Oct 8, 2021, 3:05 PM IST

Updated : Oct 8, 2021, 7:21 PM IST

15:02 October 08

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

     ఈనెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలకు సంబంధించి కీలక నామినేషన్ల ఘట్టం పూర్తైంది. భాజపా నుంచి ఈటల రాజేందర్, తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట నర్సింగ రావు తమ అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులను హుజూరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో అందజేశారు. భాజపా తరపున ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కాగా, తెరాస అభ్యర్థి శ్రీను వెంట మంత్రి హరీశ్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్​తో పాటు.. పొన్నం ప్రభాకర్​, జీవన్ రెడ్డి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లు అందించారు. మరోవైపు ఇవాళ ఈటల జమున కూడా నామినేషన్ వేశారు. వీరు కాకుండా.. పలువురు స్వతంత్ర్య అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి నామినేషన్ పత్రాలతో రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చినప్పటికీ.. వారి వెంట సరైనంత మంది ప్రపోజల్స్ లేకపోవడం, ఇతర కారణాల వల్ల వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో.. ఇవాళ కూడామరోసారి ఆందోళన చేయడంతో పాటు సీపీతో వాగ్వాదానికి దిగారు.

72 గంటల ముందే ముగియనున్న ప్రచారం

  నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగియగా.. ఈనెల 11న వీటి పరిశీలన జరగనుంది. అనంతరం 12, 13 తేదీల్లో ఉపసంహరణకు సమయమిచ్చి.. ఆ తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి అనుగుణంగా ఈవీఎంలను సర్దుబాటు చేస్తారు. 306 పోలింగ్ కేంద్రాలకు సరిపడా సర్దుబాటు చేసి హుజూరాబాద్​లోని జూనియర్ కళాశాల సెంటర్​లోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరుస్తారు. వీటిని పోలింగ్​కు ఒక్క రోజు ముందు.. అంటే ఈనెల 29న పోలింగ్ అధికారులకు అందించి పోలింగ్​ కేంద్రాలకు తరలిస్తారు. ప్రచారానికి ఈసారి గడువులోనూ కొంత మార్పు చేశారు. ప్రతిసారి ఎన్నిక ముగిసే సమయానికంటే 48 గంటల ముందు సైలెంట్ పీరియడ్ విధించేవారు. కానీ ఈ సారి దీన్ని 72 గంటలకు పెంచారు. అంటే ఈనెల 30న పోలింగ్ జరగనుండగా.. 27 సాయంత్రం 7 గంటలకు ప్రచారం ముగియనుంది. పోలింగ్ సమయం కూడా 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. నవంబర్‌ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు.

ప్రచారాలపై ఆంక్షలు  

  ఇక రేపటి నుంచి హుజూరాబాద్​ నియోజకవర్గంలో పలు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత హోరెత్తించే అవకాశం ఉంది. అయితే కొవిడ్ నిబంధనల మేరకు ప్రచారాలపై ఈసీ అనేక ఆంక్షలు విధించింది. ఇప్పటిదాకా ఆంక్షలు ఉల్లంఘిస్తూ ఆయా రాజకీయ పార్టీలు మీటింగులు, ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నాయి. కానీ రేపటి నుంచి పోలీసులు.. అభ్యర్థులు, పార్టీలు చేసే ప్రచారాలపై నిఘా పెట్టనున్నారు. ముఖ్యంగా ప్రచార సమయాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉండాలని నిర్ణయించారు. స్టార్ కాంపెయినర్లు పాల్గొనే బహిరంగసభల్లో గరిష్ఠంగా వెయ్యి మందికి మించి ఉండరాదు. ఇండోర్ మీటింగులైతే.. కేవలం 200 మందిలోపే ఉండాలి. బైక్ ర్యాలీలు, ఇతర ఊరేగింపులు నిషేధించారు. ఇంటింటి ప్రచారానికి ఐదుగురు మాత్రమే ఉండాలి. వీధుల్లో నిర్వహించే మీటింగుల్లో 50 మంది, వీడియో వ్యాన్ల ప్రచారంలోనూ 50 మంది ఆడియన్స్ మాత్రమే ఉండాలి.  

 ఇలాంటి నిబంధనలపై పోలీసులు, అధికారులు నిఘా పెట్టనున్నారు. ఇప్పటికే వీడియో వాహనాల ద్వారా మొత్తం మీటింగ్​లను షూట్ చేసి ఎప్పటికప్పుడు ఈసీకి పంపిస్తున్నారు. ఇకపై కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేయనున్నారు. ఇంకోవైపు పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు వివిధ చోట్ల జరిపిన వాహనాలు, ఇతర తనిఖీల్లో సుమారు 89 లక్షల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అనేక మందిని బైండోవర్ చేశారు.

రంగంలోకి దిగనున్న స్టార్​ క్యాంపెయినర్లు  

కీలక నామినేషన్లు ఘట్టం ముగియడంతో.. రేపటి నుంచి అన్ని పార్టీల స్టార్ క్యాంపెయినర్లు  రంగంలోకి దిగనున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీలు ఇప్పటికే 20 మంది చొప్పున తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హుజురాబాద్ బైపోల్​లో రేపటి నుంచి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

ఇదీ చదవండి: Huzurabad By Election 2021: హుజూరాబాద్​లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్

Last Updated : Oct 8, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details