ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు తగ్గిపోవడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అనుమతిస్తున్నారు. విధిగా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో గత 22రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో రెండు జిల్లాలను గ్రీన్ జోన్లోకి ఎప్పుడెప్పుడు మారుస్తారా అని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గ్రీన్ జోన్లో కొనసాగుతోంది.
ప్రస్తుతం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిని కంటైన్మెంట్ ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.