Crops Damaged Due to Hail Rains in Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత నెల 18 నుంచి రెండ్రోజుల పాటు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతినగా.. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 23 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 10 వేల ఎకరాల్లో మామిడి కాయలు రాలినట్లు అంచనా వేశారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను గత నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వర్షాలకు నేలకొరిగిన పంటలను సీఎం పరిశీలిస్తారని.. దెబ్బతిన్న పంటల ఆనవాళ్లు చెరిగిపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ భరోసా తర్వాత వ్యవసాయ అధికారులు పంటల వివరాలు నమోదు చేస్తారని రైతులు ఎదురుచూశారు. వర్షాల ప్రభావంతో అప్పటికప్పుడే జరిగిన నష్టంతో పాటు.. ఆ తర్వాత మిగిలిన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు.
పరిహారంపై రాని స్పష్టత.. ఆవేదన చెందుతున్న రైతులు:వరి పంటపై వడగళ్లు పడినప్పుడు అప్పటికప్పుడు పెద్దగా నష్టం కనిపించకపోయినా.. క్రమంగా వరి గొలుసులు పూర్తిగా నేల రాలిపోయినట్లు వివరిస్తున్నారు. వరి గొలుసులు నల్లగా మారిపోగా.. మిగిలిన మామిడికాయలను సైతం అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికీ మామిడి కాయలతో పాటు పుచ్చకాయ, మస్క్‌మిలన్ తదితర కాయలను చెట్లపైనే వదిలేసినట్లు వాపోతున్నారు. నష్టపోయిన పంటల వివరాలు ఏ మేర నమోదు చేశారు.. పరిహారం ఎంత వరకు వస్తుందనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదని వాపోతున్నారు.