కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న ఆరోపణలు ఒకవైపు ఉంటే.. మరోవైపు అత్యవసర సమయాల్లో వాహనాలు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాల నుంచి రోగులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇక్కడి నుంచి వేరే ఆసుపత్రికి తరలించాల్సి వస్తే... సరైన అంబులెన్స్ సదుపాయం కూడా లేదు.
కూతురు శవాన్ని చేతులమీదుగా...
వైద్యం పొందుతూ... చనిపోయినట్లైతే ఆ మృతదేహాలను చేరవేయడానికి ఉచిత వాహన సదుపాయం కల్పిస్తున్నామని గొప్పగా ప్రకటనలు చేయడం తప్ప... ఆచరణలో మాత్రం డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంకు చెందిన సంతోష్ తన కూతురు కోమలత చనిపోగా.. తరలించడానికి వాహనం అందుబాటులో లేదు. కూతురి శవాన్ని తన చేతులపై మోసుకెళ్లాల్సిన దుస్థితి పలువురిని కంటతడి పెట్టించింది.
అందుబాటులో లేని సేవలు...
ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉన్న ప్రత్యేక వాహన నిర్వహణ విషయంలో ఎనలేని నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పేరుకే ఆ వాహనం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో కనిపిస్తుంది తప్ప.. వాహనం కావాలంటే మాత్రం 108కు ఫోన్ చేయమని వైద్యులు చెబుతున్నారు. అది కూడా పగలు మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయంటున్నారు. సెలవులు రోజుల్లో అంబులెన్స్ కావాల్సినవస్తే... వారి తిప్పలు దేవుడికే తెలియాలి. ఇక సెలవురోజుల్లో చనిపోయిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.