ఇచ్చిన ఒక్క హామీని కూడా తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో సమావేశమైన అర్వింద్.. తెరాస సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014లో తెరాస పార్టీ విడుదల చేసిన మానిఫెస్టోలో పేర్కొన్న హామీలు గుర్తు చేస్తూ.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక విడుదల చేసిన మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా అన్ని బుట్టదాఖలే అయ్యాయని స్పష్టం చేశారు.
25 వేల మెజార్టీతో గెలుస్తాం..
"హుజూరాబాద్‌లో ఎన్నికలే లేవు. ఏకపక్షంగా పూర్తి మెజార్టీతో భాజపాదే విజయం. ఈటల రాజేందర్ గెలవటం ఖాయం. 25 వేలకు పైగా మెజార్టీతో గెలవబోతున్నాం. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. మెడికల్ కళాశాల తెస్తామని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మరి 2014లో విడుదల చేసిన మానిఫెస్టోలోనే ఈ అంశం ఉంది. అప్పటి నుంచి దాన్ని పక్కన పారేసి.. ఇప్పుడు కొత్త హామీ ఇస్తున్నట్టు ప్రజలను కొత్తగా మభ్యపెడుతున్నారు. దళిత బంధు అమలు కాకపోతే.. పేరు మార్చుకుంటామని మంత్రి హరీశ్‌రావు సవాల్ చేస్తున్నారు. మరి తెరాస మానిఫెస్టోల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు ఏం చేస్తారో చెప్పాలి." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ