NIA Raids in Karimnagar Today : కరీంనగర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది. కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ అనే వ్యక్తికి గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారుల బృందం అతడి కుటుంబసభ్యులను విచారించింది. తెల్లవారుజామున 4 గంటలకే చేరుకున్న అధికారులు.. దాదాపు 3 గంటల పాటు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తబరేజ్ ఎనిమిది నెలల క్రితమే ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
NIA On Hizb ut Tahrir case : హిజ్బుత్ తహ్రీర్ కేసు.. హైదరాబాద్‌లో పరారీలో ఉన్న సల్మాన్ అరెస్టు
Karimnagar NIA Raids : అయితే తబరేజ్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం ప్రత్యేకంగా కరీంనగర్‌కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారుజామునే కరీంనగర్ చేరుకున్న ఎన్ఐఏ టీమ్.. అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టడం కలకలం సృష్టించింది. తనిఖీలు కొనసాగుతున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కీలక నేత అరెస్ట్..: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో కీలకమైన వ్యక్తిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. పీఎఫ్ఐలో చేరిన వారికి ఆయుధ శిక్షణ ఇస్తున్న మహ్మద్ యూనిస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుతో పాటు గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 16 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిపై హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కీలక నిందితుడిని అరెస్టు చేశారు.