Multipurpose Eco friendly Agro Machine: నేటి కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల ప్రతి రంగంలో యాంత్రిక వినియోగం సాధారణం అయిపోయింది. దీనికి వ్యయసాయం మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు భూమి దున్నాలంటే నాగలి ఉపయోగించేవారు. వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. పంట పండిన తర్వాత దాన్ని మనుషులే కోసే వాళ్లు. తర్వాతి కాలంలో వరికోత యంత్రాలు (హార్వెస్టింగ్ మిషన్స్) పుట్టుకొచ్చాయి.
Student designs Multipurpose Eco friendly Agro Machine : వరి, గోధుమ పంట నూర్చడానికి పెద్ద రైతులంతా భారీ యంత్రాలు ఊపయోగిస్తుంటే.. చిన్న, సన్నకారు రైతు మాత్రం తగిన ఆర్థిక స్థోమత లేక వాటిని వాడటం లేదు. కరీంనగర్ కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంది. తన కుటుంబం పడుతున్న కష్టాలు చూడలేక శుభ శ్రీ అనే విద్యార్థి మల్టీ పర్పస్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మిషన్‌ను రూపొందించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
కరీంనగర్ పారామిత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శుభశ్రీ సాహు వారి కోయడం, వడ్లు, బియ్యం వేరు చేయడం లాంటి మల్టీ పర్పస్ యంత్రాన్ని కనుక్కుంది. ఈ ప్రాజెక్టును సీబీఎస్ఈ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ 2022-23లో ప్రదర్శించి విజేతగా నిలిచింది. జాతీయ స్థాయిలో సీబీఎస్సీ పాఠశాలల్లో “పర్యావరణ” విభాగంలో ఆమె రూపొందించిన నమూనా ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది.
వేసవి సెలవుల్లో ఒడిశాలోని తమ సొంతూరుకు వెళ్లినప్పుడు శుభశ్రీ ఈ కష్టాలను గుర్తించింది. వరి కోసం చేనులో పంజగొట్టడం,ఎద్దులతో బంతి కొట్టించి గింజలు వేరు చేయడం.. తర్వాత వాటిని తూర్పార పట్టేటప్పుడు దుమ్మూదూళి నోరు, ముక్కు లోపలికి వెళ్లి అనారోగ్యం పాలవడం వంటి అంశాల్ని గమనించింది. వారికి సాయం చేసేందుకు తన వంతు ప్రయత్నంగా ఈ యంత్రాన్ని కనుక్కుంది. శుభశ్రీ తండ్రి లలిత్ మోహన్ సాహు.. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన ప్రాజెక్టు రూపకల్పనలో సలహాలు సూచనలు ఇచ్చారు.