సొంత ఇళ్లు కట్టుకోవాలనేది ప్రతి పేదవాడి స్వప్నం. దానికోసం పైసాపైసా కూడబెడుతుంటారు. అలాంటి నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి గృహాలను కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో అర్హుల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇంటింటికీ తిరిగి జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. తమతమ గ్రామాలలో నిర్మాణాల కోసం ప్రజా ప్రతినిధులు ఆరాటపడినా స్థల కొరత ఉండడం, స్థలం ఉన్న గ్రామాలలో ఇళ్లు సముదాయంగా వద్దని తమకు ఇళ్ల స్థలాలు ఉన్న చోటనే కట్టించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీంతో ఆయా నిర్మాణ పనులలో అడుగు ముందుకు పడటం లేదు.
కరీంనగర్ జిల్లాలో ఇటీవల ఏర్పడ్డ నూతన గ్రామపంచాయతీలతో కలిపి తిమ్మాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలున్నాయి. మొదటి దశలో పర్లపల్లి, పోలంపల్లి, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, చేపలకాలనీలో మొత్తం 120 మంజూరు కాగా 89 మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో తిమ్మాపూర్‌లో మాత్రమే నిర్మాణాలు పూర్తిదశకు చేరుకోగా పోలంపల్లి, రామకృష్ణకాలనీ, చేపల కాలనీలో పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.
తిరిగి రెండో దశలో దాదాపు అన్ని గ్రామాలకు కలిపి 290 ఇళ్లు మంజూరు కాగా, 48 మాత్రమే ప్రారంభమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.