కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జోరు వానలకు కట్ట తెగడంతో నారాయణపూర్, ఇస్తారుపల్లి, మంగపేట, చర్లపల్లి గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని వరద నీటిని ఎగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. వరద నీరు ఎక్కువ రావడం, సామర్థ్యానికి మించి ప్రవహించడంతో రెండు చోట్ల గండి పడింది. దీంతో దిగువన ఉన్న నాలుగు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వరద ప్రవాహాన్ని ముందుగా అంచనా వేయలేకపోయిన అధికారులు.. హడావిడిగా గ్రామాల్లోని ప్రజలను కట్టుబట్టలతో ఖాళీ చేయించి.. పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాసాలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపూర్ రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో.. గ్రామాన్ని ముంచేస్తుందేమోనన్న భయంతో నీటి పారుదల శాఖ అధికారులే రిజర్వాయర్‌కు గండికొట్టారు. ఆ వరద ఉద్ధృతికి.. జాతీయ రహదారితో నారాయణపూర్‌ను కలిపే రోడ్డు వరదల్లో కొట్టుకుపోగా.. పాత ఇళ్లు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయగా.. తాగునీటికి కటకట ఏర్పడింది.
శాశ్వత పరిష్కారం కావాలి..: వరద కారణంగా ఆయా గ్రామాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. కోళ్లు, పశువులు మృత్యువాతపడ్డాయి. ఇస్తారుపల్లి వద్ద నిర్మించిన వంతెన పూర్తిగా వరదకు కొట్టుకుపోవడంతో పరిసర గ్రామాల్లో అల్లకల్లోలం ఏర్పడింది. నారాయణపూర్ రిజర్వాయర్ నీటితో ముంపునకు గురవుతున్న తమ గ్రామాలను.. ముంపు ప్రాంతాలుగా ప్రకటించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పునరావాస కేంద్రాలకు తరలించడం కాకుండా.. ఆర్ఆర్ ప్యాకేజీ అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.