కరీంనగర్ జ్యోతినగర్‌కు చెందిన ఆర్.నర్సింహ (Narsimha) డిగ్రీ వరకు చదివాడు. కేవలం చదువుతోనే కాదు ఏదైనా యాంత్రిక విద్య ఉంటే ఉద్యోగాలు వస్తాయేమోనన్న ఆశతో ఐటీఐ పూర్తి చేశాడు. పలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పలు చోట్ల ప్రైవేటు ఉద్యోగాల కోసం యత్నించినా... కరోనా కారణంగా ఫలితాలు అనుకున్నంత సానుకూలంగా లేవనే నిర్ణయానికి వచ్చాడు.
నిరుద్యోగి మిర్చి బండి పేరుతో..
అయితే ఖాళీగా ఉండటం కంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని భావించాడు. అయితే పెద్దగా పెట్టుబడిలేని వ్యాపారం సాధ్యం కాదనే ఉద్దేశంతో నగరంలోని ధన్గర్‌వాడి పాఠశాల వద్ద మిర్చిబండి (Mirchi Bandi) ఏర్పాటు చేశాడు. ప్రస్తుత పరిస్థితులు ప్రజలు ఎక్కువగా ఎలాంటి రుచులు ఆస్వాదిస్తున్నారో అంచనాతో మొదలు పెట్టడంతో వ్యాపారం మూడు పూవ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. తాను డిగ్రీ చదివాను కదా.. ఈ చిన్న వ్యాపారం ఎలా చేయాలా అని అనుకోకుండా ధైర్యంగా మొదలు పెట్టాడు. అనతికాలంలోనే మంచి రాబడి విపరీతంగా గిరాకీ ఏర్పడటంతో మరో నలుగురు సహాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. నలుగురు చదువుకున్న యువకులకు ఉపాధి కల్పించాడు. అతను బండికి నిరుద్యోగి మిర్చిబండి (Nirudyogi Mirchi Bandi) అని పేరు పెట్టడం అందరిని ఆకర్షిస్తోంది.
రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించా.. కానీ లాభం లేదు. ఏ నోటిఫికేషన్లు రావట్లేదు. ఇక అందుకే ఈ తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి ప్రారంభించా. ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. సాయంత్రం వరకు పని చేసుకుని ఇంటికి వెళ్తాను. నాకు రోజుకు 4,5వేల రూపాయల ఆదాయం వస్తుంది. లేబర్ ఛార్జ్ అంతా పోనూ... 3000వేల రూపాయల వరకు మిగులుతుంది.
- నర్సింహ, తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి వ్యాపారి
తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి పేరు చూడగానే ఆశ్చర్యం వేసింది. దగ్గరకు వెళ్లి అడిగా... చదువుకుని ఈ మిర్చి బండి పెట్టినట్లు తెలిసింది. ఇతను యువతకు ఆదర్శం.. అంతేకాదు.. ఇక్కడ ఉండే పదార్థాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి.