హూజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలకు ఇచ్చిన ప్రాధాన్యత... అభివృద్దికి ఇవ్వడం లేదనే అభిప్రాయం స్థానికుల్లో నెలకొంది (huzurabad by election campaign). ఓట్లు వేసేది ఇక్కడి ప్రజలే అయినా... ప్రచారంలో నేతలు మాత్రం వ్యక్తిగత ఆరోపణలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయా పార్టీలు కౌంటర్లు, ఎన్‌కౌంటర్లతోనే ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఎవరికి వారు తమ తప్పులను కప్పి పుచ్చుకుంటూ... ప్రత్యర్థుల తప్పిదాలను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికుల అవసరాలు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను విస్మరిస్తున్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న ఇరుపార్టీలు
హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొనేందుకు విమర్శలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఓటర్ల స్థితిగతులను మార్చేందుకు ఏమేం చేయబోతున్నారనే ఊసేలేదు. కేసీఆర్ అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్యే ఈ ఎన్నికలని... భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (etela rajendar) నినదిస్తున్నారు. ఈటల స్వార్థం వల్లే ఎన్నికలు వచ్చాయంటూ తెరాస నేతలు (trs leaders) వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు పార్టీలపై ధ్వజమెత్తుతూ ప్రచారం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. అయితే స్థానికుల అవసరాలేమున్నాయి, నియోజకవర్గ అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన పనులేంటి అన్న విషయం గురించి అంతగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.