ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన వేములవాడ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నాయకులు కసరత్తులు చేస్తున్నారు. గతంలో 20 వార్డులతో నగర పంచాయతీగా ఉన్న వేములవాడ...సమీప గ్రామాల విలీనం వల్ల 28 వార్డులతో పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయ్యింది. వేములవాడ ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ పట్టణం...సమస్యల వాడగా మారింది. ఇరుకుదారులతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు...కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి ప్రాధికారసంస్థ- VTADAను ఏర్పాటు చేసినప్పటికీ గత ఐదేళ్ల కాలంలో అనుకున్న స్థాయిలో పనులు జరగలేదంటున్నారు స్థానికులు. పట్టణంలో దుర్వాసన, పందులు, దోమల వ్యాప్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తెరగాలని కోరుతున్నారు.
వేములవాడను ప్రత్యేక జోన్‌గా గుర్తించాలి..
రాజన్న ఆలయంలో మహా శివరాత్రి జాతర, శ్రీరామనవమి, శివకల్యాణం, కార్తీకపౌర్ణమి, ముక్కోటి ఏకాదశితో పాటు ప్రతి ఆది, సోమవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. అయినా కనీస అభివృద్ధి జరగటం లేదనే అసంతృప్తి స్థానికుల్లో, భక్తుల్లో కనిపిస్తోంది. వేములవాడ పట్టణంలో సరిగ్గా ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో గుడిచెరువు మైదానం అపరిశుభ్రంగా మారుతోందని.. మూలవాగులో నీటికి బదులు మురుగు, పందులు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. బద్దిపోచమ్మ ఆలయాన్ని విస్తరించడమే కాకుండా. ఆలయాలు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా గుర్తించి దారులు మరమ్మతులు చేసేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. వేలాది మంది తరలి వచ్చే వేములవాడ పట్టణానికి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ధర్మపురిలో భక్తులు గోస పట్టదా..!