కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిలో రెండు ప్రాంతాల్లో టోల్‌గేట్ల ద్వారా పన్నులు వసూలు చేస్తున్నా.. ప్రమాదాలు జరిగే ప్రాంతాలు కూడా అధికమే. ప్రధానంగా దిగువమానేరు జలాశయం నుంచి వరంగల్, నల్గొండ జిల్లాలకు నీటిని తరలించే కాకతీయ కాల్వ ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్‌కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోని కెనాల్‌లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాల్వపై బ్రిడ్జి తప్ప కాల్వ పక్క రెయిలింగ్ నిర్మించక పోవడం వల్ల ఇప్పటివరకు అనేక వాహనాలు నీళ్లలో పడిపోయాయి. అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నా తగు చర్యలు మాత్రం తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
రాత్రివేళ పురుగులతో ఇబ్బందులు
గతేడాది పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం కాల్వలో పడిపోవడం వల్ల మరోసారి కాల్వ వద్ద గోడ నిర్మించాలన్న ప్రతిపాదన రూపొందించారు. దాదాపు ఏడాది తర్వాత కాల్వ పక్కన గోడ నిర్మాణం పూర్తి అయింది. ప్రధానంగా రాత్రి వేళల్లో దిగువమానేరు జలాశయం వద్ద ఏర్పాటు చేసిన వీధిదీపాల కారణంగా పురుగులు అధికంగా ఉంటాయి. వాహనం నడుపుతున్నప్పుడు కళ్లకు అడ్డంగా పురుగులు రావడం వల్ల వాహనాన్ని అదుపు చేయలేక కాల్వలో పడిపోయేవి. దీంతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కాల్వలో పడిపోకుండా గోడను నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు తగ్గిపోయినట్టేనని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.