కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరపాలికతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏడు నెలల కిందటే కొత్త పాలకవర్గాలు కొలువు దీరిన విషయం తెలిసిందే. ఇంకేముంది ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వైపు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరిలో పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికోసం వార్డు కమిటీలు కూడా ఖరారు చేశారు. ఐదేళ్ల అభివృద్ధిపై 10రోజుల పాటు జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రణాళికలు కూడా చేశారు.
ఇప్పటికే వార్డు కమిటీలు
ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వం వార్డు, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, పుర, నగరపాలక అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేలా వీరికి అవకాశం కల్పించారు. డివిజన్లు, వార్డుల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి హరితహారం, పారిశుద్ధ్య పనులు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి భాగస్వామ్యం చేశారు. వార్డు, డివిజన్‌లో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయగా, అందులో యూత్, మహిళా, విశ్రాంత ఉద్యోగులు, పర్సనాలిటీ కమిటీలు ఎంపిక చేశారు. ఒక్కొక్క కమిటీలో 15మంది చొప్పున ఒక వార్డుకు మొత్తం 60మంది సభ్యులున్నారు.
వార్డుకో పురపాలక అధికారి
వార్డులు, డివిజన్‌లలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకునేందుకు వార్డుకో పురపాలక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పారిశుద్ధ్యం, హరితహారం, పౌరసేవలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీలకు వెళ్లకుండానే, అధికారులు దొరకడం లేదనే ఇబ్బందులు లేకుండా డివిజన్లు, వార్డుల్లోని అధికారుల దగ్గరికి వెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.