ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి దుకాణాలు, ఇళ్లకు ఇనుప జాలీలు దర్శనమిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు చేపట్టారు. ఒకేసారి 30 నుంచి 40 వానరాలు దండెత్తి వచ్చి దుకాణాల్లోని సామాన్లు లాక్కెళ్లడం.. పళ్లు, కూరగాయలు తీసుకెళ్లటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్లే మార్గంలోని ప్రతి దుకాణానికి ఇనుప జాలీలు దర్శనమిస్తున్నాయి.
వానర వనాలు
ప్రణాళిక బద్ధంగా వానర వనాలు పెంచితే కోతుల బెడద తగ్గించవచ్చని ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే ప్రతి గ్రామ పంచాయతీలో వానర వనాలను పెంచాలని సూచించింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లి జిల్లాలో 263, జగిత్యాల జిల్లాలో 100 రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 వానర వనాలను పెంచాలని ఆదేశించింది. గత రెండేళ్లుగా ఆయా జిల్లాలో వానర వనాలను పెంచుతున్నారు. అయితే వానర వనాల పెంపకం కేవలం ఫైళ్లకే పరిమితమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.