mother love is great: "అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. దేవుడే లేడని మనిషన్నాడు అమ్మే లేదనేవాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు. అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా.. అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా.. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేల్పు అమ్మ ఒక్కటే.. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది" అని దాశరథి కృష్ణామాచారి అన్నారు.
నిజమే ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది ఏమున్నది. నీ జీవితంలో ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడుగా నిలిచేది తల్లి ప్రేమ ఒక్కటే అని నిరూపించింది మాటలు రాని ఈ వానరం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం తన పిల్ల వానరాన్ని తీసుకొని రోడ్డు దాటబోతున్న ఓ తల్లి కోతిని లారీ ఢీ కొనడంతో తల్లికి తీవ్ర గాయలయ్యాయి. ఆ పరిస్థితుల్లోనూ పిల్లను పొట్ట కింద పెట్టుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకోంది ఆ కోతి.