Modern Teaching at Karimnagar Government School :సర్కార్ ప్రభుత్వ స్కూల్లలో సరైన వసతులు ఉండవన్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్లబాట పట్టిన స్థానిక చిన్నారులను..ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తోంది. కరీంనగర్ జిల్లాలోనిప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా తరగతి గదిలో బోధనలోనూ సరికొత్త సౌకర్యాలను కల్పించారు. ఈసారి ఉన్నత పాఠశాలల్లో సాంకేతిక పరికరాలతో బోధిస్తున్నారు.
Telangana Mana Ooru Mana Badi Program 2023 :జిల్లాలో తొలి విడతలో మన ఊరు-మన బడి పథకంలో ఎంపికైన 213 పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా.. పలు పాఠశాలల్లో చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్నిట్లో పనులు పూర్తయ్యాయి. జిల్లాలో ఎంపిక చేసిన 94 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో 8, 9, 10వ తరగతి గదుల్లో వాటిని పాఠశాలల ప్రారంభానికి ముందే నెలకొల్పడంతో.. ఉపాధ్యాయులు వాటిపైనే బోధిస్తున్నారు.
Modern Teaching in Government Schools :ఒక్కో పాఠశాలకు సుమారు 10 లక్షలతో.. 75 అంగుళాల తెర, ఓపీఎస్ మెటల్ ఫ్రేమ్, ఆన్‌లైన్ యూపీఎస్‌లు, బ్యాటరీలను సమకూర్చారు. విద్యుత్ సరఫరా లేకున్నా దాదాపు 6 గంటల పాటు బ్యాటరీల సాయంతో ఇవి పని చేస్తాయి. వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించడంతో యూట్యూబ్‌తో పాటు వివిధ యాప్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. పాఠ్యాంశాలకు కావాల్సిన వివరాలను.. చిత్రాలు, వీడియోల రూపంలో అర్థవంతంగా ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఈ సౌకర్యాలు కల్పించడంతో పాఠశాలల్లో హాజరు శాతంతో పాటు నూతన ప్రవేశాలు పెరిగాయని.. సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.