MLC Padi Kaushik Reddy Intresting Comments: రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని, మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం ఈ విషయం స్పష్టం చేశారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ దిల్లీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడిస్తే తాము సహించమన్నారు. తనకు మహిళలంటే చాలా గౌరవమని.. అయితే గవర్నర్ తీరు వల్లే విమర్శించానని చెప్పారు.
శాసనసభలో ఆమోదం పొందిన రాష్ట్ర అభివృద్ధి బిల్లులను ఆపడంతో కడుపుమండి విమర్శలు చేశానని అన్నారు. తన భాషను విమర్శిస్తున్న బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ మాట్లాడే భాషపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని త్వరలో మంత్రితో ప్రారంభింపజేస్తామని, దీనికి ఈటలను గౌరవంగా ఆహ్వానిస్తామన్నారు.
హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. కేటీఆర్ పర్యటన నియోజకవర్గ కార్యకర్తల్లో జోష్ నింపింది.