సన్న రకాల వరి ధాన్యానికి కొంత ధర పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుండగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. రైతులకు మేలు చేద్దామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను అమలు చేయకుండా కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు మండలాల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రైతులకు పెద్దపీట
భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిమితంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. మొక్కజొన్నను ఇతర దేశాల నుంచి కేంద్రం తక్కువ ధరకు దిగుమతి చేసుకుని... మన రైతుల నడ్డి విరిచే విధానాన్ని అవలంభిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.1880లు మద్దతు ధర చెల్లించి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మక్కలు క్వింటాకి రూ.1855 ధర చెల్లిస్తోందని వెల్లడించారు.