రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని ప్రారంభించే సందర్భంగా ఈ నెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని షెడ్యూల్ట్ కులాల సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఈ చరిత్రాత్మకమైన సభకు లక్షా 20వేల మంది హాజరవుతారని, ఇందులో ఎక్కువ సంఖ్యలో దళితులే ఉంటారని చెప్పారు. సభ జరిగే మైదానాన్ని మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభను విజయవంతం చేసేందుకు గాను చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన చర్యల గురించి జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
825 బస్సుల్లో..
సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి కొప్పుల అన్నారు. సభకు 825 బస్సుల్లో దళితులు వస్తారని చెప్పిన మంత్రి.. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. సభానంతరం వారికి భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు. సభకు దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరవుతారని చెప్పారు.