Dalithabandhu Units: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని.. ఒకప్పుడు వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు ఇవాళ ఓనర్లుగా మారడం దళితబంధు వల్లే సాధ్యమైందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. 146 మంది లబ్దిదారులకు 63 యూనిట్లుగా, 51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 6 డీసీఎం వ్యాన్లు, 1 ట్రాక్టర్, 1 వరినాటు వేసే యంత్రాన్ని మంత్రులు పంపిణీ చేశారు.
ఆర్థికంగా ఎదగాలి: కొప్పుల
ఒక్కో హార్వెస్టర్ రూ. 22 లక్షలు, ఒక్కో జేసీబీ రూ.34 లక్షలు, డీసీఎం వ్యాన్ రూ. 24 లక్షలు కాగా.. మొత్తంగా 15 కోట్ల 30 లక్షల రూపాయల విలువ చేసే వాహనాలను లబ్ధిదారులకు అందించామని మంత్రి తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసీబీలు, డీసీఎం వ్యాన్ ఎంపిక చేసుకున్నారని అన్నారు. వీటితో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ది సాధిస్తారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు.
వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు: గంగుల
దళితబంధు పథకం నిరంతర ప్రక్రియ అని.. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నాలుగు మండలాల్లో పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంత్రులుగా తాము లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దళిత కుటుంబాల నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా వారికి ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా యూనిట్లను మంజూరు చేయడం.. వారికి బంగారు భవిష్యత్తును నెలకొల్పుతుందని అన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రం మొత్తం దళితబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
గొప్ప కార్యక్రమం