నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితమే హుజూరాబాద్‌లో పునరావృతం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుడి పోరాడి... జైలుకెళ్లిన విద్యార్థి, బీసీ నేత గెల్లు శ్రీనివాసయాదవ్‌కు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్‌లో భాజపా గెలిస్తే ఒరిగేదేమి ఉండదని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే పెండింగ్ అభివృద్ధి పూర్తవుతుందన్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తలసాని దుయ్యబట్టారు.
విడ్డూరం
జైలుకెళ్లిన వ్యక్తులే జైళ్లకు పంపిస్తామని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. స్థాయికి మించి విమర్శలు చేయవద్దని.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తమకంటే బలవంతుడు ఎవరు లేరని తలసాని వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. తాము చాలా చూశామన్నారు. సభలకు జనాలు రాగానే ఊగిపోవద్దని.. చిన్నచిన్న పార్టీలకు కూడా వస్తున్నారన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి కోరారు.
ఎక్కడా లేవు
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు... ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం తెరాస అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో... మంత్రి దీనిపై స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.