హుజూరాబాద్‌లో ఈటల గెలిచాక ఏమైనా చేశారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమిత్ షాను తీసుకువచ్చి హుజురాబాద్‌లో నిధుల వరద పారిస్తామని చెప్పారని తెలిపారు. ఈ 14 నెలల్లో కేంద్రం నుంచి ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని మండిపడ్డారు. 2004లో టీఆర్ఎస్ టికెట్ కోసం 33 మంది పోటీ పడితే ఈటలకు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్‌కు రాజకీయ జన్మ ఇచ్చింది కేసీఆర్ అని తెలిపారు.
రాజకీయ జన్మ ఇచ్చిన వ్యక్తి కడుపులో పొడిచిన వ్యక్తి ఈటల రాజేందర్ అని కేటీఆర్ మండిపడ్డారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని మోదీ అన్నారని గుర్తు చేశారు. మోదీ చెప్పిన రూ.15 లక్షలు ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. దేశ ప్రజల సంపదనంతా మోదీ ఒక్కడి ఖాతాలోనే వేశారని ఆరోపించారు. అన్ని నిత్యావసరాల ధరలు పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలేనని వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం పేదలను కొట్టి ధనికులకు పంచుతోందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని వివరించారు. ఈ 8 ఏళ్లల్లో మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పులు మోదీ ఒక్కరే చేశారని చెప్పారు. ప్రజల పన్నులతోనే హైవేలు నిర్మిస్తే... మరి టోల్ రుసుం ఎందుకు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా నిరసనలు తెలిపారని పేర్కొన్నారు. నిరసనల్లో 700 మంది రైతులు చనిపోతే కూడా మోదీ చలించలేదని వ్యాఖ్యానించారు.