తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Comments: 'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'

KTR Comments: రాబోయే 6 నుంచి 9 నెలల్లో 80 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని.. నిరుద్యోగ యువకులంతా రాబోయే కాలంలో ప్రిపరేషన్ కోసం సమయం కేటాయించాలని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. కేసీఆర్​పై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని​ మండిపడ్డారు. కేసీఆర్​ను తొక్కేస్తామని, జైలుకు పంపిస్తామని కొందరు మాట్లాడుతున్నారన్న ఆయన.. సీఎం ఏం తప్పుడు పని చేసారని జైలుకు పంపిస్తారంటూ ప్రశ్నించారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో సీసీ రోడ్ల పనులకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్​ భూమి పూజ చేశారు.

KTR Comments: 'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'
KTR Comments: 'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'

By

Published : Mar 17, 2022, 6:15 PM IST

'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'

KTR Comments: తెలంగాణ తెచ్చిన కేసీఆర్​పై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో సీసీ రోడ్ల పనులకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రవిశంకర్​, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​తో కలిసి మంత్రి కేటీఆర్​ భూమి పూజ చేశారు. కేసీఆర్​ను తొక్కేస్తామని, జైలుకు పంపిస్తామని కొందరు మాట్లాడుతున్నారన్న ఆయన.. సీఎం ఏం తప్పుడు పని చేసారని జైలుకు పంపిస్తారంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా?.. రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తున్నందుకు కేసీఆర్​ను ఇంటికి పంపిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కేసీఆర్​ను ఎందుకు దింపేస్తరు?

రైతుబీమా ఇచ్చి చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్​ను తిడుతున్నారా? అని కేటీఆర్​ ప్రశ్నించారు. కేసీఆర్​ను ఎందుకు పదవి నుంచి దింపేస్తారో చెప్పాలన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టినందుకు కేసీఆర్​ను పదవి నుంచి దింపేస్తారా అంటూ అడిగారు. ఎమ్మెల్యే ఎన్నికలయ్యాక మూడు నెలలకు పార్లమెంట్ ఎన్నికలొస్తే తాము పట్టించుకోకపోవడం వల్ల.. తంతే బూరెల గంపలో పడ్డట్టు బండి సంజయ్ ఎంపీగా గెలిచారన్నారు.

చొప్పదండికి తట్టెడంతా చొప్పనన్నా తెచ్చాడా?.

'ఆయన నిన్న, ఇవాళ బాగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్​ను జైలుకు పంపుతానంటున్నాడు. ఎందుకు పంపుతావంటే మాట్లాడడు. చొప్పదండి ఎమ్మెల్యే చేసిన పనులు వరుసపెట్టి వంద చెబుతాడు.. బండి సంజయ్ ఏం చేశాడో చెప్పాలి. బండి సంజయ్ దగ్గర విషయం ఉండదు.. తెల్లారి లేస్తే విషం చిమ్మడం తప్ప.. హిందూ ముస్లిం పేరుతో రెచ్చగొట్టడం తప్ప... చొప్పదండికి తట్టెడంతా చొప్పనన్నా తెచ్చాడా? చొప్పదండికి సైనిక్ స్కూల్ కావాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని అడిగితే తెచ్చాడా? డబుల్ ఇంజిన్లలో నీ ఇంజిన్ ఇక్కడున్నా... ఎందుకు పీకి పందిరేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పార్లమెంట్​లో ఒక్కరోజైనా మాట్లాడిండా? కరీంనగర్​కు ఒక్క ఐఐటీ, ఐఐఎం తెస్తే మన పిల్లలు బాగుపడరా.. ఎందుకు తేవడం లేదు. ఎప్పుడూ హిందూ అనే మాట్లాడే బండి సంజయ్... కనీసం ఒక్క గుడైనా కట్టిండా? చొప్పదండి మున్సిపాలిటీకి బండి సంజయ్ ఒక్క రూపాయైనా తెచ్చాడా? వేములవాడ గుడికైనా నిధులు తేవచ్చు కదా. డబుల్ ఇంజిన్​లో మోదీ కాశీని బాగు చేస్తే... ఇక్కడి ఇంజిన్ దక్షిణ కాశీ వేములవాడను బాగు చేయొద్దా? -కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

మోదీ సర్కారు చేసిందేమీ లేదు..

పేదలకు, బలహీన వర్గాలకు మోదీ సర్కారు చేసిందేమి లేదని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ఎప్పటికైనా కష్టసుఖాల్లో తోడుండేది గులాబీ జెండా మాత్రమేనన్నారు. తాము ఇటీవలే కరీంనగర్​కు మెడికల్​ కాలేజీ మంజూరు చేశామన్నా ఆయన.. అన్ని జిల్లాల్లో మెడికల్​ కళాశాలలు వస్తాయన్నారు. తెలంగాణలో విద్యార్థులు ఉక్రెయిన్​, ఫిలిప్పిన్స్​కు మెడికల్​ విద్య కోసం పోయే బాధ ఉండదన్నారు. తెలంగాణ రాకముందు 150 లోపు గురుకుల పాఠశాలలుంటే.. ఇప్పుడు 900 గురుకుల పాఠశాలల పెట్టి.. నాణ్యమైన విద్యను లక్షలాది మంది విద్యార్థులకందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం 16 వేల కోట్ల రూపాయలను ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద ఇస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారికోసం అంబేడ్కర్​ ఓవర్సీస్, జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కీం కింద 20 లక్షలు ఇస్తున్నామన్నారు. 26 వేల సర్కారు స్కూళ్లను రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రాబోయే 6 నుంచి 9 నెలల్లో..

'ఆధునికమైన విద్యా యజ్ఞాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఇంటి స్థలాలున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 3లక్షలు ఇస్తాం. చొప్పదండిలో మూడు వేల మందికి ఇళ్లకోసం ఈ ఆర్థిక సంవత్సరం డబ్బులిస్తాం. రాబోయే 6 నుంచి 9 నెలల్లో 80 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. నిరుద్యోగ యువకులంతా రాబోయే కాలంలో ప్రిపరేషన్ కోసం సమయం కేటాయించాలి. -కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

సమస్యలన్నీ తీరుస్తున్నాం..

గతంలో సిరిసిల్లకు ఏడాదికి కోటి రూపాయలు నిధులొస్తే పటాకులు కాల్చి సంబురాలు చేసుకునేవాళ్లమన్న ఆయన.. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన చొప్పదండి లాంటి చిన్న మున్సిపాలిటీలకు కూడా నిధులిస్తున్నామన్నారు. చొప్పదండికి ఇప్పుడు 74 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఒకప్పుడు 50 లక్షలైనా ఇవ్వాలని అప్పటి నేతలు బతిమాలేవారన్న మంత్రి.. ఇప్పుడు చొప్పదండి అభివృద్ధికి కావాల్సినన్ని నిధులిచ్చి సమస్యలన్నీ తీరుస్తున్నామన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు.

జూన్ నుంచి వారికి పింఛన్లు ఇస్తాం..

'కేసీఆర్ వచ్చాక పింఛన్లు పెంచుకున్నాం. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు సర్కారు అండగా ఉంటోంది. కరోనా కారణంగా ఆలస్యమైన కొత్త పింఛన్లు మే లేదా జూన్ నుంచి ఇస్తాం. బడ్జెట్​లో కూడా ఇందుకోసం నిధులు కేటాయించాం. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన దాదాపు 7-8 లక్షల మందికి జూన్ నుంచి పింఛన్లు ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పై చిలుకు ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కింద లక్షకు పైగా డబ్బులిచ్చాం. కేసీఆర్ కిట్ కింద మగపిల్లాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు ఇస్తున్నాం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 శాతానికి ప్రసవాలు పెరిగాయి. మాతా శిశు మరణాలు తెలంగాణలో తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని నీతి ఆయోగ్ చెప్పింది. -కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

గంగాధరను మున్సిపాలిటీ చేయాలా..

గంగాధరను మున్సిపాలిటీ చేయాలని ఎమ్మెల్యే కోరారని... నిజంగా కావాలో చెప్పాలని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ చేస్తే కొన్ని నష్టాలు కూడా ఉంటాయని.. ఉపాధి హామీ పథకం పోతుందన్నారు. నిజంగా మున్సిపాలిటీ కావాలంటే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే గంగాధరను మున్సిపాలిటీ చేస్తామని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details