తెలంగాణ

telangana

ETV Bharat / state

harish rao : 'ఇంకో గంట టైముంది.. ఇప్పటికైనా ఒక్క హామీ ఇవ్వండి' - హుజూరాబాద్​ ఉప ఎన్నిక ప్రచారం వార్తలు

హుజూరాబాద్​లో తెరాసదే విజయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి తెరాస విజయబావుటా కొనసాగుతోందని హరీశ్​రావు పేర్కొన్నారు.

harish rao
harish rao

By

Published : Oct 27, 2021, 5:51 PM IST

Updated : Oct 27, 2021, 6:37 PM IST

హుజూరాబాద్​లో తెరాసదే గెలుపని అన్ని సర్వేలు చెబుతుంటే... వారి ఓటమి ఖాయమని తెలిసి విపక్షాలు తెరాసపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. తెరాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. గోబెల్స్‌ ప్రచారంతో గెలవాలని భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర నిధులపై తెరాస విసిరిన సవాలుకు భాజపా వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా ఓ తొండాట ఆడిందని.... అధికార పార్టీపై బురద జల్లడం తప్ప ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పలేదన్నారు.

'గ్యాస్​ బండ భాజపా నెత్తిన పడడం ఖాయం. ఇన్నాళ్ల ప్రచారంలో.. ప్రజలకు ఏమైనా చేస్తామని హామీ ఇచ్చారా.? ఎప్పుడు మా పార్టీని, మా అధినేతను పరుషపదజాలంతో దూషించడం తప్ప.. ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేదు. గ్యాస్​ సబ్సిడీని ఎందుకు తగ్గించారు. ఇంకో గంట టైముంది.. ఇప్పటికైనా ఒక్క హామీ ఇవ్వండి.. గ్యాస్​ సింలిండర్​కు దండం పెట్టు. భాజపాను బొందపెట్టండనే నినాదానికి భారీ స్పందన వచ్చింది. తెరాస సంక్షేమ పథకాలే విజయాన్ని అందిస్తాయి. గోబెల్స్‌ ప్రచారంతో గెలవాలని భాజపా యత్నిస్తోంది. కేంద్ర నిధులపై తెరాస విసిరిన సవాలుకు భాజపా వద్ద సమాధానం లేదు. ఇవాళ లీటరు చమురుపై కేంద్రం రూ.31 వసూలు చేస్తోంది. యూపీఏ పాలనలో చమురుపై కేంద్రం పన్ను రూ.4 మాత్రమే ఉండేది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లను మేం నమ్ముకున్నాం. ఏడేళ్లలో రాష్ట్రానికి భాజపా ఏం చేసిందో ఆ నేతలు చెప్పాలి.'

-హరీశ్​రావు, మంత్రి

దళితబంధు ఆపింది ముమ్మాటికీ భాజపానేే

దళితబంధు ఆపింది ముమ్మాటికీ భాజపా నేతలేనని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దళితబంధుపై ప్రేమేందర్ రెడ్డి ఈసీకి లేఖ రాశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై భాజపా నేతలు ఎప్పుడైనా చర్చించారా అని ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలనేది భాజపా ఉద్దేశమని హరీశ్‌రావు అన్నారు.

రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు భాజపాకు లేదు

రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు భాజపాకు లేదని హరీశ్​రావు విమర్శించారు. సాగు చట్టాలు రద్దు చేయాలని ఏడాదిగా రైతులు పోరాడుతుంటే.. ధర్నా చేస్తున్న రైతులను కేంద్రమంత్రి కుమారుడు కారుతో తొక్కించారని ఆరోపించారు. రైతుల చావుకు కారణమైన కేంద్రమంత్రిపై ఇప్పటికీ చర్యలు లేవని... ధర్నా చేస్తున్న రైతులను కొట్టాలని ఒక భాజపా సీఎం పిలుపునిచ్చారని.. రైతులను కారుతో తొక్కించిన చరిత్ర భాజపాదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

భాజపా పాలన అంతా రాయితీల కోతలు, పన్నుల వాతలు

రైతులు కారు కొనుక్కునే స్థితికి ఎదగాలనేది తెరాస లక్ష్యమని... వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతులను చంపాలని భాజపా చూస్తోందని హరీశ్​రావు ఆరోపించారు. భాజపా నేతలు ఎన్నికలప్పుడే ఎస్సీల ఇళ్లల్లో భోజనం చేస్తారని.. ఎన్నికలు లేనప్పుడు మేం ఎస్సీల కోసం పథకాలు అమలు చేస్తున్నామని హరీశ్​రావు అన్నారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన నేత ఏం చేశారని హరీశ్​రావు ప్రశ్నించారు. భాజపా పాలన అంతా రాయితీల కోతలు, పన్నుల వాతలని... తెరాస పేదలకు పంచింది, భాజపా పేదలను దంచిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

ఈటల ఆత్మగౌరవం అప్పుడే పోయింది

ఈటలను తెరాస 6 సార్లు ఎమ్మెల్యేను, రెండు సార్లు మంత్రిని చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పేదల అసైన్డ్‌ భూములు కబ్జా చేసిప్పుడే ఈటల ఆత్మగౌరవం పోయిందని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో రెండుపడక గదుల ఇళ్ల కోసం నిధులిస్తే.. ఒక్క ఇంటిని కూడా నిర్మించి పంచలేదన్నారు. పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5.04 లక్షలు ఇస్తామని హరీశ్​రావు ప్రకటించారు.

'తెరాస పేదలకు పంచింది, భాజపా పేదలను దంచింది'

భాజపా నేతలే దిల్లీకి బానిసలు

రైల్వే లైన్లు విక్రయించే భాజపా.. స్టేషన్లు ఆధునీకరిస్తామనటం హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడో హామీ ఇచ్చిన రైల్వే కోచ్‌ పార్టీ అతీగతి లేదు.భాజపా పాలిత రాష్ట్రాల్లో రూ.2016 పింఛను ఉందా?... ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్‌ను బానిస అంటూ అవమానించారు. భాజపా నేతలే దిల్లీకి బానిసలు. తెలంగాణ ప్రజలకు మేము బానిసలం. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలను నమ్మొద్దు. - హరీశ్​రావు, మంత్రి

ఇదీ చూడండి:Dharmapiri Arvind: 'హుజూరాబాద్​లో గెలుపు ఏకపక్షమే.. 25 వేల మెజార్టీతో గెలుస్తాం'

Last Updated : Oct 27, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details