ఏడేళ్ల పాటు మంత్రిగా ఉన్న ఈటల.. హుజూరాబాద్(HUZURABAD) నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని మంత్రి హరీశ్ రావు(HARISH RAO) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయం అడిగినందుకు తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా నియోజకవర్గంలోని స్వశక్తి మహిళా సంఘాల గ్రూపులకు మంత్రి.. రూ.కోటి 25 లక్షల 60 వేల విలువ చేసే చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల, కేంద్రంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్.. తెరాసకు రాజీనామా చేసి భాజపాలోకి వెళ్లారు కదా.. అలా వెళితే ఎవరికి లాభమని ప్రజలను హరీశ్ అడిగారు. తెరాస పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఓటేస్తారని అడిగారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడానికి భాజపానే కారణమని హరీశ్ ఆరోపించారు.
సెంటిమెంట్ డైలాగులు కాదు.. పనిచేసే వాళ్లను గెలిపించాలి. ఏడేళ్ల పాటు మంత్రిగా ఉండి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు కట్టించలేదని అడగటం తప్పా.? గ్రైండర్లు, కుంకుమ భరిణిలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి ఇస్తున్నాం. గర్భిణీలకు కిట్లు అందిస్తున్నాం.
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి