కుంభవృష్టి కురిసినా శాలపల్లిలో దళితబంధు సభ జరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు(HARISH RAO) స్పష్టం చేశారు. ప్రజలంతా మధ్యాహ్నం ఒంటిగంట వరకు సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. సభను కుండపోత వర్షం సైతం ఆపలేదని ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో తెలిపారు.
దళితబంధు(Dalitha Bandhu) పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు నేడు సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సభా ప్రాంగణంలోకి, రోడ్ల మీదకు వర్షపు నీరు చేరింది. వేదిక వద్దకు చేరుకునే దారి బురదమయంగా మారింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది గుంతలమయమైన రహదారులను సరి చేస్తున్నారు. కంకర నింపుతూ మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతుందా? లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు.
హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాలు, దళిత కాలనీల్లోకి ఇప్పటికే బస్సులు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శాలపల్లి దళితబంధు సభకు తరలిరావాలని మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఇవాళ ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కోరారు.