కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao in huzurabad election campaign) పాల్గొన్నారు. ధర్మరాజుపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిపించాలని కోరుతూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలోనూ... ప్రజల గురించి ఆలోచించి... మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి.. ప్రజలను ఆదుకున్న కేసీఆర్‌ను గెలిపిస్తారా...? రైతుల నడ్డి విరుస్తున్న భాజపాను గెలిపిస్తారా? ఆలోచించుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక... కరెంటు సమస్య, నీటి సమస్య పోయిందా లేదా? ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం.. నీళ్ల కోసం బోర్లు తవ్వించే.. పని బంద్ అయిందా లేదా ఆలోచించాలని సూచించారు. ఆర్థిక సాయం చేసే ప్రభుత్వాన్ని దీవిస్తారా? రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న భాజాపా అభ్యర్థిని గెలిపిస్తారా? ఆలోచించుకోవాలని సూచించారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్న భాజపాకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.