ప్రజలు ఓట్లు వేస్తే ఏం చేస్తారో ఈటల రాజేందర్ (Etela Rajender) సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao). ఏ పని చేయాలన్న తెరాస ప్రభుత్వమే చేస్తోందని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఇల్లందకుంటలో తెరాస ప్రజా ఆశీర్వాద సభ (Trs Praja Ashirvada Sabha)లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో రెండున్నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందన్న హరీశ్... హుజూరాబాద్‌లో తెరాస, భాజపాకు మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందు కనిపిస్తోందని హరీశ్ పేర్కొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ (Cm Kcr) పనిచేస్తున్నారని హరీశ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్నింటిపై ధరలు పెంచిందని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ రైతుబంధు ఇవ్వొద్దని అంటున్నారని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. రైతుబంధు ఇవ్వొద్దనే వారి గురించే ప్రజలే ఆలోచించాలని సూచించారు. రైతుబంధు వద్దంటున్న ఈటల రాజేందర్ మాత్రం రూ.10 లక్షలు తీసుకున్నాడని విమర్శించారు. ఈటలను రెండుసార్లు మంత్రిని చేసిన కేసీఆర్‌పై తీవ్ర పదాలు వాడుతున్నాడని చెప్పారు.
ఈటల దత్తత తీసుకున్న సిరిసేడును కూడా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్న హరీశ్... మంత్రిగా ఉన్నప్పుడే ఇల్లు కట్టించలేకపోయిన ఈటల ఇప్పుడే గెలిస్తే కట్టిస్తాడా అని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏమైనా అభివృద్ధి చేశారా అని అడిగారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నందునే ఈటల రాజేందర్ పనులు చేశారని హరీశ్ తెలిపారు.
కాళేశ్వరం వచ్చాక నిండు ఎండల్లో కూడా నీరు పారిందన్నారు. తెరాస ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతోందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈటలకు మేలు జరగాలా లేక 2.29 లక్షలమందికి లాభం జరగాలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్‌ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ గులాబీ జెండాను మోసం చేశారని ఆరోపించారు.