తెరాసపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెరాస ఏడేళ్లుగా మోసం చేస్తోందని అనడం ఆత్మవంచనే అని ఆయన పేర్కొన్నారు. కేంద్రమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచేసిందని మంత్రి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా అంటూ ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.. చేశారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఏడేళ్ల తెరాస పాలనలో పింఛన్, రైతుబంధు, కల్యాణలక్ష్మి నిధులు పెంచామని.. అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టామన్నారు.
పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న భాజపా
ఎన్నికల్లో గెలిచేందుకు వాగ్దానాలు చేశామని గతంలో కేంద్రమంత్రి గడ్కరీ అన్నారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బంగాల్‌లో వేల కోట్లు ఖర్చు చేసినా భాజపాను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని ఈటల విమర్శించలేదా అంటూ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతకు భాజపా నాయకులే కారణమని మంత్రి మండిపడ్డారు. పేదప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
రైతు బంధులో కేంద్రం వాటా 'సున్న'
తెరాస అధికారంలోకి వచ్చాకా రైతుబంధు పేరు మీద రైతులకు రూ.40వేల 37కోట్లు ఇచ్చామని హరీశ్ తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వమే బిల్లులు చెల్లించిందన్నారు. ఇందులో కేంద్రం వాటా ఒక్క రూపాయి కూడా లేదన్నారు. దీనితో పాటు కల్యాణలక్ష్మి, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లను కూడా ఇస్తున్నామన్నారు. ఆసరా పింఛన్లలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే.. కేంద్ర సర్కారు కొసరు మాత్రమే ఇస్తోందని మండిపడ్డారు. భాజపాను గెలిపిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తారా అంటూ ప్రశ్నించారు.
అబద్ధాలు ఆడటంలో, ప్రజలను వంచించడంలో భాజపాను మించినోళ్లు ఎవరుంటరు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనం ప్రజల బ్యాంకు అకౌంట్లలో వేస్తామన్నారు.. వేశారా?. అధికారంలోకి వస్తే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. తగ్గినయా లేక పెరిగినయా?. రెండింతలు పెంచిన ఘనత వారిదే. 2014లో భాజపా అధికారంలోకి వచ్చినపుడు లీటర్ పెట్రోల్ ఉన్న పన్ను రూ.10.43 అయితే.. ఈ రోజు కేంద్రం పెట్రోల్ మీద వేస్తున్న పన్ను రూ.32.90. ప్రజల మీద ప్రేమ ఉంటే ధరలు తగ్గించండి. లేదంటే అబద్ధాలు చెప్తున్నామని ధైర్యంగా చెప్పండి. -హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
'తెరాసపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే' ఇదీ చదవండి: KISHAN REDDY: అబద్దాలు ఆడటం కేసీఆర్ లక్షణం .. మడమ తిప్పడం ఆయన నైజం