లేఖలు రాసి పది రోజులు దళిత బంధును ఆపేసిన భాజపా నాయకులు శునకానందం పొందుతున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దళిత బంధును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి భాజపానే కారణమని విమర్శించారు. జమ్మికుంటలో ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పలువురు కాంగ్రెస్, భాజపా కార్యకర్తలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, భాజపాలు చీకటి ఒప్పందం చేసుకుని... తెరాసను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయని హరీశ్ ఆరోపించారు. భాజపా వైఖరిని నిరసిస్తూ హుజూరాబాద్ అంబేడ్కర్ కూడలి వద్ద ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. తెరాస నాయకులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణలో నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే భాజపా కుట్రలు పన్నుతోందన్నారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. దళిత బంధును నిలిపివేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తేనే.. ఈనెల 30వ తేదీ వరకు దళిత బంధు నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పథకాన్ని వాళ్లే ఆపాలని లేఖ ఇచ్చి.. దొంగే దొంగ అన్నట్లుగా అరుస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అందువల్లనే పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు తమను తెలంగాణాలో కలుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుకుంటున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.