తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao on BJP: రూపాయి బొట్టుబిళ్ల దిక్కు ఉందామా? కేసీఆర్​ వైపు ఉందామా? - హుజూరాబాద్ ఉప ఎన్నికల వార్తలు

హుజూరాబాద్‌లో ఓటు అడిగే నైతిక హక్కు భాజపా నేతలకు లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు . పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు తగ్గిస్తామనే హామీతో ఓట్లు అభ్యర్థించాలని చురకలు అంటించారు. రైతులను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా మోసం చేస్తోందని మండిపడ్డారు. గుడ్డిగా భాజపాకు ఓటు వేస్తే మరింత కష్టాల్లోకి పడడం ఖాయమని హెచ్చరించారు.

Harish Rao
Harish Rao

By

Published : Sep 12, 2021, 8:04 PM IST

Updated : Sep 12, 2021, 9:03 PM IST

భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తుందా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. మున్నూరు కాపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఓ గార్డెన్‌లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి గంగుల కమలాకర్​తో పాటు హాజరయ్యారు. మంత్రులను మున్నూరు కాపులు సన్మానించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వటం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు ఇస్తుంటే కేంద్రం ఎనర్జీ ఆడిట్ అంటోందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టమంటోందని... పెట్టమంటారా అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపారని విమర్శించారు.

'రైతుల దగ్గర పైసలు గుంజుడే తెలుసు. రైతుల దగ్గర డబ్బులు తీసుకునే ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చరిత్రను తిరగరాశారు. నీటి తీరువాను రద్దు చేసి... ఉచితంగా మీ కాలువలకు నీరందిస్తున్నారు. పంట పండించే రైతుకు ఎకరానికి 10 వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చింది తెరాస ప్రభుత్వం. సిలిండర్ ధర 1000 చేసినా మాకేం పర్యాలేదని పువ్వు గుర్తుకు ఓటేద్దమా?'

- హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

పెంచిన సిలిండర్, డీజిల్ ధరలను తగ్గిస్తామని భాజపా హామీ ఇచ్చి ప్రచారం చేయాలని హరీశ్ రావు అన్నారు. భాజపా వాళ్లవి మొసలి కన్నీరు, మాయ మాటలని విమర్శించారు. చెప్పుకోడానికి, చేసింది, చేసేది ఏం లేదు కాబట్టే బొట్టు పిల్లలు, గడియారాలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇచ్చే రూపాయి బొట్టు పిల్ల దిక్కు ఉందమా? మన పేదింటి ఆడ పిల్లకు రూ.1,00,116 ఇచ్చే కేసీఆర్ వైపు ఉందామా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండే ఈటల రాజేందర్ రెండు పడక గదుల ఇళ్లను కట్టలేదని అన్నారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని హరీశ్​ రావు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్ని కేంద్రం అమ్మకానికి పెడుతోందని హరీశ్​ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భావితరాల కోసం ఆస్తులను కూడ బెడుతుంటే కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందని ఆరోపించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ లేదన్నారు. రానున్న ఉప ఎన్నికలు తెరాస, భాజపాకు మధ్య పోటీ అన్నారు. రానున్న ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మున్నూరు కాపులు తెరాసకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Harish Rao on BJP: రూపాయి బొట్టుబిళ్ల దిక్కు ఉందామా? కేసీఆర్​ వైపు ఉందామా?

ఇదీ చదవండి :ఆస్పత్రిలో అర్జున్ రెడ్డి... పూటుగా తాగొచ్చి విధులు

Last Updated : Sep 12, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details