హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని.. ఓట్లను అమ్ముకోరని అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి గంగుల పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘ నాయకులు మంత్రి గంగుల సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ప్రజలకు ఈటల ఎన్ని తాయిలాలు ఇచ్చిన ప్రజలంతా తెరాస వైపే ఉన్నారని మంత్రి గంగుల అన్నారు. ఎన్నికల వాతావరణంలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆత్మ గౌరవం గుర్తుకు వచ్చిందా.. అని ఎద్దేవా చేశారు. ఈటల భాజపాలో చేరి తన ఆత్మ గౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టాడని... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని... అందుకోసమే భాజపాలో చేరారని విమర్శించారు. ప్రైవేటీకరణవల్ల చాలా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వబోతుంటే.. కేంద్రం మాత్రం ఉద్యోగులను తొలగిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గందె రాధిక, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల వాతావరణంలో ఈటల రాజేందర్‌కు ఆత్మగౌరవం మాట గుర్తొచ్చింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీకి తాకట్టుపెట్టిన నాయకుడు నీవైతే.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్. నోట్లకోసం తెలంగాణ ప్రజలు అమ్ముడుపోయే బిడ్డలా..?, నీ హుజూరాబాద్ బిడ్డలు అమ్ముడుపోయే వ్యక్తులనుకున్నారా..? నోట్లతో ఓట్లను కొనుగోలుచేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంది అందుకని మీరు భాజపాలో చేరారా అని అందరూ ప్రశ్నించండి. తెరాస ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే... కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తుంది. ఏమి ఇచ్చిందని భాజపాకు ఓటేయాలని ప్రతిఒక్కరు ప్రశ్నించండి.