ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీళ్లతో పాటు చెట్లంటే ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో హరితహారం, రైతు వేదికలు, కల్లాల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అందమైన పూలమొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల ప్రధాన రహదారులతో పాటు, జిల్లా సరిహద్దుల వరకు ఉన్న రోడ్లకు ఇరువైపులా రెండుమూడు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు.
డీఎంఎఫ్టీ నిధుల నుంచి హరితహారం కార్యక్రమానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కరీంనగర్ నగర పాలక సంస్థకు రూ.50 లక్షలు, చొప్పదండి మున్సిపాలిటీ రూ.30 లక్షలు, కొత్తపల్లి మున్సిపాలిటీకి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ వనం..
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు వెదురుగట్ట అడవికి 'కేసీఆర్ వనం'గా నామకరణం చేసి తీర్మానం చేశారు. హరితహారంలో భాగంగా వెదురుగట్టులో అధికసంఖ్యలో మొక్కలు నాటారని రవిశంకర్‌ను మంత్రి అభినందించారు. కురిక్యాల గ్రామంలోని బొమ్మలగుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.