రేషన్ కార్డుల జారీపై సబ్ కమిటీ సూచించిన విధంగా పెండిగ్లో ఉన్న అప్లికేషన్లను త్వరగా పరిశీలించి స్పష్టమైన నివేదికను వారం రోజుల్లో తయారు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ అంశాలపై కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, డీఎస్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే ఎన్ఐసీ, ఐటీ డిపార్ట్మెంట్ పరిశీలనలో మిగిలిన 4,15,901 కార్డులకు సంబంధించి 11,67,827 మంది లబ్ధిదారుల వివరాలపై క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రక్రియ వేగవంతం
అత్యధికంగా దరఖాస్తులు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులను గుర్తించి రేషన్ కార్డు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలోని రేషన్ కార్డులకు త్వరలోనే స్మార్ట్ కార్డును జారీచేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలియజేశారు. రేషన్ డీలర్ల సమస్యలు, నూతన రేషన్ షాపుల ఏర్పాటు గురించి అధికారులతో చర్చించారు.