Gangula Kamalakar Fires On Central Government: దిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కరీంనగర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. కరీంనగర్‌కు పర్యాటకులు వచ్చేలా కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఆంధ్రా పార్టీలు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. పాదయాత్రల పేరుతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్య పాలన ఇదివరకే చూశామని.. మళ్లీ మీ పాలన తమకు అవసరం లేదని గంగుల కమలాకర్ విమర్శించారు. దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదని.. ఇదేనా భాజపా సంస్కృతి అని మండిపడ్డారు. జీఎస్టీ తాము కడితే.. ఫలాలు మాత్రం గుజరాత్‌కా అని ధ్వజమెత్తారు. ప్రధాని రామగుండంలో కొత్తగా ఏమైనా కర్మాగారాలు ప్రకటిస్తారని అనుకుంటే.. కేవలం రాజకీయాలే మాట్లాడారని ఆరోపించారు. దిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి.. సంపద అందరికీ పంచాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
"ఇప్పటికే పాదయాత్ర పేరు మీద తెలంగాణ గడ్డపై కొంత మంది ఆంధ్ర పాలకులు తిరుగుతున్నారు.కేఏ పాల్ లాంటి వారు కోతి వేషాలు వేస్తున్నారు. ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం సరికాదు. పన్నులు కట్టేది మేము.. పంచేది గుజరాత్‌కా. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. సంపద అందరికీ పంచాలి." - గంగుల కమలాకర్, మంత్రి