గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ కూడా తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల పర్యటించారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లోని పలు గ్రామాలను ఆయనతో పాటు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ విజయ, కలెక్టర్ శశాంకలు కలిసి తిరిగారు. వాహనాలు వెళ్లలేని చోటుకు గ్రామస్థులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లి దెబ్బతిన్న పంటలను మంత్రి ఈటల పరిశీలించారు. రైతులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. చెరువులను, వాగులను పరిశీలించి నీటి ఉద్ధృతిని గమనించారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శశాంకతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
4 ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిరంతరంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయన్నారు. వాగులు, చెరువులు, కుంటలు నిండాయన్నారు. అక్కడక్కడ గండ్లు కూడా పడ్డాయన్నారు. వీటితో చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయన్నారు. వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయన్నారు.
వచ్చే 48 గంటల కూడా భారీవర్ష సూచన
అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడటమనేది చాలా అరుదుగా జరుగుతాయన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. దెబ్బతిన్న రోడ్లను, కాల్వలను వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత మరమ్మతులు చేస్తామన్నారు. రాబోయే 48 గంటలు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రతమత్తంగా ఉండాలన్నారు. అన్ని చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగమంతా సిద్దంగా ఉందని మంత్రి ఈటల
చెప్పారు.
ఇవీ చూడండి: వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష