జమ్మికుంట మార్కెట్ మాదిరిగానే హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. పట్టణంలో కోటీ 26 రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను మంత్రి ఈటలతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ కలిసి ప్రారంభించారు.
కరోనాతో ప్రతిఒక్కరూ సహజీవనం చేయాల్సిందే..: మంత్రి ఈటల
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి... హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకరానికి హాజరయ్యారు.
స్థానిక సివిల్ ఆసుపత్రిలో నూతనంగా చేపట్టిన కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రికి కేటాయించిన 3 ఆంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రి ఈటల, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీష్‌కుమార్ హాజరయ్యారు.
కరోనా మహమ్మారితో తప్పకుండా ప్రతి ఒక్కరు సహజీవనం చేయాల్సిందేనని మంత్రి తెలిపారు. తప్పకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పండగలను ఇంట్లోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ పాలకవర్గం ఏర్పాట్లలో కూడ రిజర్వేషన్లను తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.