కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు కావటం సంతోషకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ మున్సిపల్ కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు గురి చేసిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ గడ్డ మీద ఈ వైరస్‌కు వ్యాక్సిన్ తయారు కావటం గర్వకారణమన్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఆ వ్యాక్సిన్ మొదటగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత పోలీసులతోపాటు ఇతర రంగాలకు ప్రాధాన్యమిస్తామన్న మంత్రి.. నిరుపేదలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.