Millers Frauds in Telangana : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రైస్‌మిల్లులు.. ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. కూలీల కొరత ఇతరత్రా కారణాలు చెబుతూ ఏ నెలకానెల బియ్యం ఇవ్వకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఒక సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి బియ్యం ఎఫ్‌సీఐ లేదా రాష్ట్రపౌరసరఫరాల శాఖకు ఇవ్యాల్సి ఉంటుంది. కానీ బియ్యం తిరిగి ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్లు మొక్కుబడిగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఒక గడువు విధిస్తూ వస్తున్నారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు అవాంతరాలు ఏర్పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వంరైస్‌మిల్లర్ల వ్యవహారాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరించింది. తాజాగా రైస్‌మిల్లర్లపై ఆధారపడకుండా ప్రభుత్వమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ క్రమంలో సర్కార్ కు రావాల్సిన సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లుల్లో ధాన్యం ఉన్నాయా లేదా తనిఖీలకు శ్రీకారం చుట్టింది.
Millers Frauds in FCI Rice : పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలో పౌరసరఫరాలశాఖ ఛైర్మన్ రవీందర్‌సింగ్ తనిఖీలు చేపట్టారు. సీఎంఆర్ ఇవ్వకుండా ధాన్యం పక్కదారి పట్టించారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పలు మిల్లులపై దాడులు నిర్వహించారు. 2 బృందాలుగా ఏర్పడిన అధికారులు 4 మిల్లులను తనిఖీ చేశారు. ముందుగా మహాలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేయగా సీఎంఆర్ కింద కేటాయించిన 82 లక్షల విలువ చేసే సుమారు 4వేల క్వింటాళ్లు 10వేల బస్తాలు ధాన్యం తక్కువగా ఉండటాన్ని గుర్తించారు.
ఆ తర్వాత వరుణ్ ఇండస్ట్రీస్‌ను తనిఖీ చేయగా సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యం నిల్వలు అసలే కనిపించకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. యజమాని శీలాశ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే వేరే గోదాములో ఉన్నాయని.., తనకు అనార్యోగంగా ఉందంటూ ఆస్పత్రిలో చేరడంతో బియ్యం లేనట్లు అధికారులు నిర్ధారించి, తనిఖీలు చేయకుండా మిల్లును సీజ్ చేశారు. సీఎంఆర్ ధాన్యం లెక్కల్లో తేడాలున్న ఈ రెండు మిల్లులు శీలాశ్రీనివాస్‌వే. లక్ష్మీగణపతి రైస్‌మిల్లుకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో 3వేల 817 బస్తాలు తక్కువగా ఉన్నాయి. సీఎంఆర్ కింద ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో లేకపోతే సంబంధిత మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ ఛైర్మన్ రవీందర్‌సింగ్ తెలిపారు.
"ప్రభుత్వానికి మా ధాన్యాన్ని పంపిస్తున్నారా లేదా గోదాముల్లో మా ధాన్యం ఉందా లేదా అన్నది తనిఖీలు చేస్తున్నాము. మా ధాన్యం ఏ వ్యక్తి దగ్గరైతే ఉండదో వారు ఎంత పెద్ద వారైనా వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మా బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి." - రవీందర్ సింగ్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మెన్