మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి లొంగుబాటు అంత సులువు కాదని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. మావోయిస్టు ఉద్యమంలో 17 ఏళ్లపాటు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేయడంతోపాటు గణపతి, ఇతర అగ్రనేతలతో సన్నిహితంగా మెలిగి రెండేళ్ల క్రితం లొంగిపోయిన ఆయన బుధవారం ‘ఈనాడు’తో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. ‘‘ఉద్యమంలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేసిన గణపతి అనారోగ్య కారణాలతో లొంగిపోతారని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా మంది మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కీలక నేతలు అనారోగ్యంగా ఉన్నా కేంద్ర కమిటీ అన్నీ చూసుకుంటుంది.
తీవ్ర అనారోగ్యం పాలై నడవలేని స్థితిలోగానీ, ప్రాణాపాయ స్థితిలోగానీ ఉంటే మాత్రమే బయటికి పంపించేందుకు పార్టీ ఆలోచిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ సభ్యురాలికి కరోనా సోకితే కేంద్ర కమిటీలో కచ్చితమైన నిర్ణయం జరిగిన తర్వాతే ఆమె సరైన మార్గంలో లొంగిపోవడానికి పార్టీ చర్యలు తీసుకుంది.
నేను పార్టీ విధానాల్ని వ్యతిరేకించినా.. నా లొంగుబాటుకు పార్టీ సహకరించింది. మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నాకున్న సమాచారం మేరకు ఆరా తీశా. గణపతి లొంగుబాటు గురించిన సమాచారం లభించలేదు. గతంలో కొండపల్లి సీతారామయ్య అజ్ఞాతంలో ఉండగానే పార్కిన్సన్ వ్యాధికి గురయ్యారు.