తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై పోరు... కరీంనగర్​లో మాస్క్ వాల్ అవగాహన - masks awareness in karimnagar

కరోనా విజృంభన కొనసాగుతుండగా మాస్కులు విధిగా వినియోగించాలని ప్రచారం చేస్తున్నా... చాలా మంది ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు లేకుండా సంచరించవద్దని ప్రచారం చేస్తున్నా... నిర్లక్ష్యం చేస్తున్నారు. కరీంనగర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ మాస్క్‌వాల్‌ ఏర్పాటు చేసి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

Mask Wall
కరీంనగర్​లో మాస్క్ వాల్ అవగాహన

By

Published : Apr 16, 2021, 10:26 PM IST

కరీంనగర్ బస్టాండ్ వద్ద మాస్క్‌వాల్ ఏర్పాటు చేసి ఓ స్వచ్ఛంద సంస్థ మాస్కుల గురించి ప్రచారం చేస్తున్నారు. వందలాది మంది బస్టాండ్‌ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి వారు విధిగా మాస్కు ధరించాలని పలు చోట్ల బోర్డులు ఏర్పాటు చేసినా కొంత మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనితో స్వచ్ఛంద సంస్థ రోజుకు 500 నుంచి 1000 వరకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు.

మాస్క్ వాల్...

మాస్క్ వాల్‌ను ఏర్పాటు చేసి వాటిని ఎలా వినియోగించాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. మాస్కు అనగానే కొంత మంది కర్చీఫ్ కట్టుకోవడం మరికొంత మంది వైరస్‌ను అడ్డుకుంటుందా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారని అందువల్లే తాను అవగాహన కల్పిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఘన్‌శ్యాం ఓజా తెలిపారు.

బస్టాండ్‌లో ప్రతి ఒక్కరికి మాస్కులు ఇవ్వడంతో పాటు ఆర్టీసీ డ్రైవర్లకు కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ మాస్కు ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ఈ ప్రచారానికి పోలీసు అధికారులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు.

మేము సైతం...

స్వచ్ఛంద సంస్థ మాస్కుల గురించి చేస్తున్న ప్రచారం పట్ల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉచితంగా మాస్కులు తీసుకోవడమే కాకుండా వాటిని ఎలా వినియోగించాలి? ఎలా తొలగించాలి? మాస్కుల వాడకం ఎంత అవసరమో తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటామని చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్‌‌ ఉద్ధృతంగా సాగుతున్న క్రమంలో ఒకవైపు టీకా పంపిణీ కొనసాగిస్తూనే తగిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details