Pulsar Bikes Theft In Karimnagar : బైక్ షోరూంలో బైక్ చెకింగ్, డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నట్లు నటించి.. ఈ ఘరానా మోసగాడు ఏకంగా 25 పల్సర్ బైక్‌లను చోరీ చేశాడు. అంతే కాకుండా యజమానికి అనుమానం కలగకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. ఎంతటి దొంగైనా సరే ఏదో ఒక దగ్గర దొరికిపోవడం ఖాయం.. ఈ బైక్ దొంగతనంలో కూడా అలానే జరిగింది. చోరీకి పాల్పడిన ఆనందం శ్రీకాంత్, మధ్యవర్తి అశోక్‌ను చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన కరీంనగర్ జిల్లాలోని బజాజ్ బైక్ షోరూంలో బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. భూపాలపల్లికి చెందిన ఆనందం శ్రీకాంత్ వ్యక్తి కరీంనగర్‌లోని సీతారాంపూర్ బజాజ్ షో రూంలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఈజీ మనీకి అలవాటు పడి.. షోరూంలో వరుస దొంగతనాలకు పాల్పడడం మొదలు పెట్టాడు. టెస్ట్ రైడ్‌ల పేరిట కొత్త పల్సర్ బైకులను బయటకి తీసుకెళ్లి.. ఎవరికీ అనుమానం రాకుండా అశోక్ అనే వ్యక్తి సహాయంతో సగం ధరకు అమ్ముకుంటూ ఉండేవాడని పోలీసులు తెలిపారు.
అయితే మూడు నెలలుగా ఇలా 25 బైకులను అమ్ముతున్నా.. యజమాని గుర్తించ లేకపోయాడని వివరించారు. ఈ సందర్భంగా చొప్పదండికి చెందిన బైక్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. దీనిపై రహస్యంగా దర్యాప్తు చేసిన పోలీసులకు షోరూం డెలివరీ బాయ్ ఆనందం శ్రీకాంత్, అశోక్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ గ్రామీణ ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు తెలిపారు.
"శ్రీకాంత్ అనే వ్యక్తి భూపాల్‌పల్లి జిల్లాలో నివాసం ఉంటూ ఉండేవాడు. అతను చెన్నై నివాసి. ఇతను కరీంనగర్‌లోని బజాజ్ షోరూంలో బైక్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ ఉండేవాడు. షోరూం నుంచి బైక్‌లను డెలివరీ చేస్తున్న ముసుగులో బయటకు తీసుకొని వచ్చి.. లక్ష రూపాయల బైక్‌ను మధ్యవర్తుల ద్వారా రూ. 40వేలకు అమ్మేవాడు. ఇలా దాదాపు 25 కొత్త బైక్‌లను దొంగతనంగా అమ్మేశాడు. బైక్‌ను కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను చేయలేదని చెప్పి.. ఓ కొనుగోలుదారుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైటు ఇచ్చారు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం విషయం బయటకు వచ్చి.. శ్రీకాంత్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేశాం." - తాండ్ర కరుణాకర్ రావు, కరీంనగర్ గ్రామీణ ఏసీపీ
25 పల్సర్ బైకులను దొంగతనం చేసిన వ్యక్తి వివరాలు తెలిపిన ఏసీపీ ఇవీ చదవండి: